Telangana: తెలంగాణ రాష్ట్రంలో చలి ప్రభావం రోజురోజుకు పెరిగిపోతుండగా పలు జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. ముఖ్యంగా ఆదిలాబాద్‌లో శీతల గాలులు తీవ్రంగా వీయడంతో ఉష్ణోగ్రత 8.2 డిగ్రీల వరకు తగ్గి ఈ సీజన్‌లో అత్యల్పంగా నమోదైంది. మెదక్‌లో 12.8, పటాన్‌చెరువు 14, రాజేంద్రనగర్‌లో 14.5, నిజామాబాద్‌లో 14.7, రామగుండంలో 14.8 డిగ్రీల చలిని నమోదు చేశారు. హనుమకొండలో 15.5, హైదరాబాద్‌లో 17.4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత పడిపోవడంతో నగరవాసులు తీవ్ర చలి అనుభవిస్తున్నారు.
Also Read: CM Revanth Reddy: నారాయణపేట జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన
హైదరాబాద్ నగరంలో ఉదయం నుంచి రాత్రి వరకు చలిగాలులు వీస్తుండడంతో ప్రజలు బయటకు వచ్చే ప్రతీసారి స్వెటర్లు, షాల్స్, మంకీ క్యాపులు వాడటం తప్పనిసరైంది. ఉదయాన్నే చలికి వణికే పరిస్థితి ఉండటంతో వాకింగ్‌కు వెళ్లేవారి సంఖ్య కూడా తగ్గిపోయింది. తెల్లవారుజామున పలు రహదారులపై మంచు పొరలు ఏర్పడటంతో వాహనదారులు డ్రైవింగ్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో మంచు పరిస్థితి కారణంగా విజిబిలిటీ తగ్గి ప్రయాణాలు క్లిష్టంగా మారాయి.
దిత్వా తుపాను ప్రభావంతో తెలంగాణలో పలు జిల్లాల్లో సోమవారం వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. మరో రెండు రోజుల పాటు హైదరాబాద్ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం, రాత్రివేళల్లో తేలికపాటి జల్లులు పడొచ్చని పేర్కొన్నారు. తూర్పు-ఆగ్నేయ దిశ నుంచి గంటకు 4–6 కిలోమీటర్ల వేగంతో ఉపరితల గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు.

