Weather Update

Weather Update: అక్కడ చలి.. ఇక్కడ వర్షాలు! తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉందంటే..

Weather Update: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో వాతావరణం బాగా మారిపోయింది. తెలంగాణలో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది, కొన్ని ప్రాంతాలలో కనిష్ట ఉష్ణోగ్రతలు ఏకంగా సింగిల్ డిజిట్‌కు పడిపోయాయి. రాజధాని హైదరాబాద్‌ను కూడా కోల్డ్ వేవ్స్ (చలిగాలులు) వణికిస్తున్నాయి. ఈ తీవ్రత దృష్ట్యా, తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అటు ఆంధ్రప్రదేశ్‌లోని మన్యం జిల్లాలో సైతం నీళ్లు గడ్డ కట్టేంత చలి గాలులు వీస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు ఈ చలి తీవ్రత కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

ఆంధ్రప్రదేశ్, యానాం వాతావరణ సూచన
అమరావతి వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ – యానాం ప్రాంతంలో దిగువ ట్రోపో ఆవరణములో ఈశాన్య, తూర్పు దిశల నుండి గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో:

* ఉత్తర, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం: సోమవారం, మంగళవారం రోజుల్లో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఈ ప్రాంతాలలో ఒకటి లేదా రెండు చోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుండి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. బుధవారం కూడా వాతావరణం పొడిగానే ఉండే అవకాశం ఉంది.

* రాయలసీమ: సోమవారం ఇక్కడ పొడి వాతావరణం ఉంటుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు ఒకటి, రెండు చోట్ల సాధారణం కంటే 2-4 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయి. అయితే, మంగళవారం మరియు బుధవారం రోజులలో రాయలసీమలో ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ రెండు రోజుల్లో కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు తక్కువగానే ఉండే అవకాశం ఉంది.

తెలంగాణ వాతావరణ సూచన
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో చలి తీవ్రత పెరగనుంది. దీని కారణంగా, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2°C నుండి 3°C వరకు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు చలి నుంచి రక్షణ పొందేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *