Coimbatore: తమిళనాడులోని కోయంబత్తూరు నగరంలో ఇటీవల జరిగిన సామూహిక అత్యాచార కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నవంబర్ 2వ తేదీ రాత్రి ఒక కళాశాల విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడిన ముగ్గురు నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌లో కాళ్ళపై కాల్చి అరెస్ట్ చేశారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
కోయంబత్తూరు అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని బృందావన్ నగర్ ప్రాంతంలో 20 ఏళ్ల పీజీ విద్యార్థిని తన స్నేహితుడితో కారులో ఏకాంతంగా మాట్లాడుకుంటుండగా, ముగ్గురు దుండగులు వారిని అడ్డుకున్నారు. నిందితులు యువకుడిపై కొడవలితో దాడి చేసి, తీవ్రంగా గాయపరిచి, ఆ యువతిని బలవంతంగా వేరే ప్రాంతానికి తీసుకెళ్లి దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు.
ఈ దారుణ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అవడంతో, పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. కోయంబత్తూరు పోలీసులు ఏడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున తుడియాలూరుకు సమీపంలోని వలంకినార్ వద్ద నిందితులు దాక్కున్నారని సమాచారం అందింది.
Also Read: Drugs Party: ఐటీ హబ్‌లో డ్రగ్స్ దందా.. గచ్చిబౌలిలో 12 మంది అరెస్ట్
నిందితులు గుణ, కరుప్పసామి, కార్తీక్ అలియాస్ కాళీశ్వరన్లను పట్టుకునేందుకు హెడ్ కానిస్టేబుల్ చంద్రశేఖర్ ప్రయత్నించగా, వారు కొడవలితో దాడి చేసి పారిపోయేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో ఆత్మరక్షణలో భాగంగా పోలీసులు వారి కాళ్లపై కాల్పులు జరిపి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఎన్‌కౌంటర్‌లో గాయపడిన కానిస్టేబుల్ చంద్రశేఖర్‌ను, అలాగే నిందితులను చికిత్స కోసం కోయంబత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కోయంబత్తూరు నగర పోలీసు కమిషనర్ శరవణ సుందర్ ఈ అరెస్టులను ధృవీకరించారు. నిందితులపై ఇప్పటికే హత్య, దోపిడీతో సహా మొత్తం ఐదు కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. తమిళనాడులో చోటుచేసుకున్న ఈ సామూహిక అత్యాచారం ఘటనపై ప్రతిపక్షాలు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని, రాష్ట్రంలో మహిళల భద్రత విషయంలో శాంతిభద్రతల వైఫల్యంపై తీవ్రంగా విమర్శలు గుప్పించాయి.

