పశ్చిమ బెంగాల్‌లోని బీర్‌భూమ్ జిల్లాలోని బొగ్గు గనిలో ఘోర ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం బొగ్గు గనిలో భారీ పేలుడు సంభవించడంతో ఏడుగురు కార్మికులు మరణించారని, మరో ముగ్గురు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. కోల్‌కతాకు వాయువ్యంగా 200 కి.మీ దూరంలో ఉన్న బీర్‌భూమ్‌లోని ఖైరాసోల్‌లోని గంగారామ్‌చక్, గంగారామ్‌చక్-భదులియా బొగ్గు బ్లాక్ వద్ద ఉదయం10 గంటలకు ట్రక్కులో పేలుడు సంభవించింది.
ఈ పేలుడులో ఏడుగురు వ్యక్తులు మరణించగా, గాయపడిన వారిని జిల్లా కేంద్రమైన సూరిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.పేలుడు మృతుల శరీర భాగాలు చెల్లచెదురుగా పడిపోయాయని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు పెద్ద ఎత్తున ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
పేలుడు పదార్ధాలను ట్రక్కు నుంచి కిందకు దించుతున్నప్పుడు ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. మృతుల కుటుంబానికి పరిహారం, ఇల్లుతోపాటు కుటుంబీకులకు ఉద్యోగం కూడా ఇవ్వాలని బాధితులు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.