Siddaramaiah: బెంగళూరులోని సూర్యనగర్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) బ్రాంచ్‌లో చోటు చేసుకున్న భాషా వివాదం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ఒక కస్టమర్ కన్నడలో మాట్లాడమని కోరినపుడు, మేనేజర్ నిరాకరించడం, దురుసుగా స్పందించడం పెద్ద కలకలం రేపింది.
ఈ ఘటనలో ఎస్‌బీఐ మేనేజర్ స్పందనను చిత్రీకరించిన వీడియో సోషల్ మీడియాలో వేగంగా పాకింది. వీడియోలో మేనేజర్, “నేను ఇంగ్లిషులో మాత్రమే మాట్లాడతా, నాకు నచ్చిన భాషలోనే మాట్లాడతా,” అంటూ కస్టమర్‌తో వాగ్వాదానికి దిగారు. ఇది నెటిజన్ల మధ్య తీవ్ర అసంతృప్తికి దారితీసింది. ఫలితంగా, ఎస్‌బీఐ అధికారులు ఆమెను బదిలీ చేశారు.
ఈ సంఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా స్పందించారు. “స్థానిక భాషను గౌరవించడం ప్రతి ఉద్యోగి బాధ్యత. ప్రజలతో మర్యాదగా మాట్లాడాలి. బ్యాంకులు ప్రజలకు సేవ చేయడానికి ఉన్నాయి, వివాదానికి కాదు,” అని స్పష్టంగా అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు.
అంతేగాక, అన్ని బ్యాంకు ఉద్యోగులకు స్థానిక భాషలు, సంస్కృతి పట్ల అవగాహన పెంచేలా శిక్షణ ఇవ్వాలని కేంద్ర ఆర్థిక సేవల విభాగానికి సీఎం విజ్ఞప్తి చేశారు. ఇది కేవలం ఎస్‌బీఐ పరిమితమైన సమస్య కాదు అని, దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులలో భాషా గౌరవం పాటించాల్సిన అవసరం ఉందని ఆయన హితవు పలికారు.
Also Read: Google I/O 2025: గూగుల్ మీట్‌లో కొత్త రియల్ టైమ్ ట్రాన్స్‌లేట్ ఫీచర్
Siddaramaiah: కన్నడ రక్షణ వేదిక (KRV) సహా అనేక భాషా సంఘాలు ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించాయి. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు కూడా నిర్వహించనున్నట్లు వారు ప్రకటించారు. “బ్యాంకులు స్థానిక భాషలో ప్రాథమిక సేవలు అందించలేకపోతున్నాయి. ఇది కస్టమర్లకు అవమానం,” అని వారు ఆరోపించారు.
ఈ ఘటన కేవలం ఒక వీడియోతో ప్రారంభమైనా, భాషపై సమాజంలో ఉన్న భావోద్వేగాలను బయటపెట్టింది. దీనిపై ప్రభుత్వ స్థాయి నుండి తక్షణ చర్యలు తీసుకోవడం, భవిష్యత్తులో అలాంటి సంఘటనలు జరగకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యమవుతుంది.