Cm revanth: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రైతులకు అనేక ఊరటలు కలిగించే మరో చర్య చేపట్టారు. సోమవారం ఆయన హైదరాబాద్లోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో నిర్వహించిన ‘రైతు నేస్తం’ కార్యక్రమంలో పాల్గొని, ‘రైతు భరోసా’ నిధులను విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “రైతులను రాజులుగా చేయడమే కాదు, వ్యవసాయాన్ని పండుగలా మారుస్తాం అనే ఉక్కు సంకల్పంతో ముందడుగు వేస్తున్నాం” అని పేర్కొన్నారు. ప్రభుత్వం ఎన్ని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా, రైతులకు మాత్రం ఇబ్బంది లేకుండా చూసేందుకు తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు.
ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 70,11,984 మంది రైతులకు, రూ.9 వేల కోట్ల రైతు భరోసా నిధులను వచ్చే ఏడు రోజులలో వారి ఖాతాల్లోకి జమ చేయనున్నట్లు ప్రకటించారు. అనంతరం సీఎం స్వయంగా బటన్ నొక్కి నిధుల విడుదల కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా రైతులతో ముఖాముఖిగా మాట్లాడిన సీఎం, వారి సమస్యలు, అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా తాము ఎన్నో చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.
