Sarpanch Elections

Sarpanch Elections: సర్పంచ్ ఎన్నికల జోరు.. సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన ఖరారు

Sarpanch Elections: తెలంగాణ పల్లెల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఎన్నికల సందడే కనిపిస్తోంది. గ్రామ పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే ముహూర్తం ఖరారు చేసింది. మూడు దశల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పోలింగ్ నిర్వహించబోతున్నామని కమిషన్ స్పష్టం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 12,760 గ్రామ పంచాయతీలకు మరియు 1,13,534 వార్డులకు ఈ ఎన్నికలు జరుగుతాయి.

ఈ సర్పంచ్ ఎన్నికల్లో ఏకంగా 1.66 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ కూడా ఇప్పటికే ప్రారంభమైంది. మొదటి దశకు నవంబర్ 27న నోటిఫికేషన్ రాగా, చివరి దశకు డిసెంబర్ 3న మొదలవుతుంది. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది, ఆ వెంటనే అదే రోజు ఓట్ల లెక్కింపు పూర్తి చేస్తారు.

Also Read: Gold Price Today: బంగారం ధరలు మళ్లీ రికార్డుల హోరు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్లు ఇవే!

ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం కోసం ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గట్టి ప్రణాళికతో రంగంలోకి దిగారు. పార్టీ నేతలతో మాట్లాడి ఆయన తన జిల్లాల పర్యటనను ఖరారు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు, ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి స్వయంగా ప్రచారంలో పాల్గొననున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు వంటి ముఖ్యమైన పథకాలు ఎన్నికల ప్రచారంలో ప్రధాన అంశాలుగా ఉన్నాయి. ఈ పర్యటనల ద్వారా ఆయన కార్యకర్తల్లో ఉత్సాహం నింపనున్నారు.

ముఖ్యమంత్రి పర్యటన వివరాలను పరిశీలిస్తే… డిసెంబర్ 1న మహబూబ్‌నగర్ జిల్లాలోని మక్తల్‌లో మొదటి సభ ఉంటుంది. ఆ తర్వాత డిసెంబర్ 2న ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో, డిసెంబర్ 3న కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌లో సమావేశాలు నిర్వహిస్తారు. ఇక డిసెంబర్ 4న ఆదిలాబాద్‌లో, డిసెంబర్ 5న నర్సంపేటలో, చివరిగా డిసెంబర్ 6న నల్గొండ జిల్లా దేవరకొండలో ముఖ్యమంత్రి సభలు ఉంటాయి. ఈ ప్రతి సభలోనూ ఆయన కార్యకర్తలు, పోటీ చేస్తున్న అభ్యర్థులతో ప్రత్యేకంగా మాట్లాడి వారికి దిశానిర్దేశం చేస్తారు. మొత్తానికి, తెలంగాణ పల్లె రాజకీయాలు ఇప్పుడు ముఖ్యమంత్రి పర్యటనలతో మరింత వేడెక్కబోతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *