Revanth Reddy

Revanth Reddy: చదువే అసలైన ఆస్తి.. గొర్రెలు, బర్రెలు కాదు మనకు కావాల్సింది

Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తాజాగా జరిగిన మాదిగ ఉద్యోగుల కృతజ్ఞత సభలో పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. స్నేహం కోసం ప్రాణాలిచ్చే కర్ణుడిలాగే, తాను కూడా మాదిగ సామాజిక వర్గానికి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటానని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో పడ్డ కష్టానికి ప్రతిఫలంగానే ఈ ‘ప్రజా ప్రభుత్వం’ ఏర్పడిందని, అందుకే ప్రజల సమస్యలను తీర్చడమే తమ మొదటి ప్రాధాన్యత అని ఆయన పేర్కొన్నారు.

ఎస్సీ వర్గీకరణ కోసం దశాబ్దాలుగా జరిగిన పోరాటాన్ని గుర్తు చేస్తూ, ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. దేశంలోనే ఎస్సీ వర్గీకరణను అమలు చేసిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని సీఎం గర్వంగా ప్రకటించారు. వర్గీకరణ వల్ల అందరికీ న్యాయం జరుగుతుందని, అయితే ఈ ప్రక్రియను అడ్డుకోవాలని చూసే వారిని ప్రజలే అడ్డుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలు పేదలకు చేరాలంటే అధికారుల బాధ్యత ఎంతో ఉందని గుర్తు చేశారు.

ముఖ్యంగా విద్య గురించి మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు గొర్రెలు, బర్రెలు పంపిణీ చేయడానికే పరిమితమయ్యాయని, కానీ తమ ప్రభుత్వం మాత్రం పేద బిడ్డలను డాక్టర్లు, ఇంజినీర్లు, ఐఏఎస్ అధికారులుగా చూడాలని ఆశిస్తోందని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం దగ్గర పంచడానికి భూములు లేవని, అందుకే చదువునే అతిపెద్ద ఆస్తిగా ప్రతి పేద బిడ్డకు అందించేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి, బడుగు బలహీన వర్గాల భవిష్యత్తుకు భరోసా కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *