CM Revanth Reddy: వృద్ధ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గట్టి వార్నింగ్ ఇచ్చింది. తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగుల జీతాల్లో 10 నుంచి 15 శాతం కోత విధించి, ఆ మొత్తాన్ని నేరుగా తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రతిపాదనపై సమగ్ర అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు.
తల్లిదండ్రులు తమ పిల్లలను ఎంతో ప్రేమగా పెంచి, చదివించి, జీవితంలో స్థిరపడేలా చేస్తారు. కానీ వృద్ధాప్యంలో వారికి ఆధారం కావాల్సిన సమయంలో చాలా మంది పిల్లలు తమ బాధ్యతలను విస్మరిస్తున్నారు. ఈ నిర్లక్ష్యం సమాజంలో ఆందోళన కలిగిస్తోంది. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం ప్రజల్లో విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది.
Also Read: konda susmitha: పరకాల అభ్యర్థి నేనే.. కొండా సురేఖ కూతురు సంచలన ప్రకటన
CM Revanth Reddy: ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు ఆర్థిక భద్రత లభించడమే కాకుండా, పిల్లలు తమ బాధ్యతలను గుర్తించేలా చేస్తుంది. ఇది సమాజంలో సామాజిక బాధ్యతను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు అభిప్రప్రాయపడుతున్నారు. ఇటీవల హైదరాబాద్‌లోని మూసారాంబాగ్‌లో 90 ఏళ్ల శకుంతలాబాయి అనే వృద్ధురాలు తన కుమారులు పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేయగా, రెవెన్యూ అధికారులు వారి ఇంటిని సీజ్ చేసి, ఖాళీ చేయాలంటూ నోటీసులు జారీ చేయడం ఈ సమస్య తీవ్రతను తెలియజేస్తుంది. ఈ చర్యలు ప్రభుత్వ సామాజిక బాధ్యతకు అద్దం పడుతున్నాయి.
తల్లిదండ్రుల సంరక్షణతో పాటు, ట్రాన్స్‌జెండర్ల సంక్షేమంపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. ఇప్పటివరకు ట్రాఫిక్ విభాగంలో మాత్రమే వారికి అవకాశాలు కల్పించగా, ఇకపై రవాణా, ఆరోగ్యం, ఐటీ, ఎండోమెంట్, ప్రైవేట్ రంగాల్లో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయం ట్రాన్స్‌జెండర్లకు సమాజంలో గౌరవప్రదమైన జీవితాన్ని గడిపేందుకు, ఆర్థికంగా స్థిరపడేందుకు దోహదపడుతుందని చెప్పవచ్చు. ముఖ్యమంత్రి తీసుకున్న ఈ రెండు కీలక నిర్ణయాలు సమాజంలో సానుకూల మార్పులను తీసుకువస్తాయని ప్రజలు హర్షిస్తున్నారు.