CM Revanth Reddy: గణేష్ నిమజ్జన వేడుకల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుస్సేన్ సాగర్ వద్దకు ఆకస్మికంగా వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఎలాంటి ప్రత్యేక భద్రత, ట్రాఫిక్ క్లియరెన్స్ లేకుండా సాధారణ పౌరుడిలా ట్యాంక్ బండ్‌కు చేరుకున్న ఆయన, నిమజ్జనం ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. గత 46 ఏళ్లలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా నిమజ్జనానికి రాలేదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
సీఎం రేవంత్ రెడ్డి అకస్మాత్తుగా రావడం చూసి అక్కడి అధికారులు, పోలీసులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్ నంబర్ 4 వద్ద నిమజ్జన ప్రక్రియను దగ్గరుండి చూసిన సీఎం, ట్రాఫిక్ నియంత్రణ, భద్రత, పారిశుధ్యం వంటి అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు.
Also Read: Hyderabad: పట్నంలో 12 వేల కోట్ల విలువగల డ్రగ్స్ స్వాధీనం
అనంతరం సీఎం రేవంత్ రెడ్డి భాగ్యనగర్ ఉత్సవ మండపం ఎక్కి ప్రజలకు అభివాదం చేశారు. “గణపతి బప్పా మోరియా” అంటూ నినాదాలు చేశారు. భక్తులతో కలిసిపోయి నడుస్తూ, వారి మధ్య నిలబడి ఏర్పాట్లను పరిశీలించడం ద్వారా సీఎం రేవంత్ తన సాధారణతను చాటుకున్నారు. ప్రజలు కూడా సీఎంను చూసి సంతోషం వ్యక్తం చేశారు. నిమజ్జనంలో పాల్గొన్న పోలీసు సిబ్బందిని, ఇతర అధికారులను సీఎం అభినందించారు. నిమజ్జనాలు పూర్తి అయ్యేవరకు ఇదే స్ఫూర్తితో పనిచేయాలని, భక్తులు, సందర్శకులు క్షేమంగా ఇళ్లకు చేరుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి పర్యటనతో నిమజ్జన ఏర్పాట్లపై ప్రభుత్వం ఎంత శ్రద్ధ తీసుకుంటుందో స్పష్టమైంది.