Revanth Reddy: ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి దశాబ్దాలుగా వెన్నెముకగా నిలిచిన మాజీ మంత్రి దామోదర్ రెడ్డి (దామన్న) సేవలు మరువలేనివని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. ఆదివారం (అక్టోబర్ 12) తుంగతుర్తిలో దామోదర్ రెడ్డి సంతాప సభకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి.. దివంగత నేత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
‘కార్యకర్తల కోసం ఆస్తులు అమ్ముకున్న దామన్న’
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… దామోదర్ రెడ్డిని పార్టీ కోసం, కార్యకర్తల కోసం అహర్నిశలు పనిచేసిన నిస్వార్థ నాయకుడిగా అభివర్ణించారు. “దామన్న కేవలం నాయకుడు మాత్రమే కాదు, ఆయన నమ్ముకున్న కార్యకర్తలకు అండగా నిలబడ్డారు. పార్టీ కోసం, కార్యకర్తల కోసం తన ఆస్తులు అమ్ముకున్న గొప్ప మనసు దామన్నది” అని పేర్కొన్నారు. కార్యకర్తలపై దాడులు జరిగిన ప్రతిసారీ దామన్న వారికి అండగా నిలబడ్డారని అన్నారు.
దామోదర్ రెడ్డి ఐదుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సేవలందించారని, జిల్లాలో కాంగ్రెస్ జెండాను సగర్వంగా నిలబెట్టిన ఘనత ఆయనకే దక్కుతుందని సీఎం రేవంత్ అన్నారు. సూర్యాపేట, తుంగతుర్తి ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంలో ఆయన కృషి అమోఘమన్నారు.
ఇది కూడా చదవండి: Anita: నారా భువనేశ్వరి పై ట్వీట్ చేసిన హోం మంత్రి
జిల్లాకు గోదావరి జలాల ఘనత దామన్నదే:
నియోజకవర్గ ప్రజలకు దామోదర్ రెడ్డి చేసిన సేవలను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. “దశాబ్దాలుగా కరువుతో అల్లాడుతున్న ప్రాంతానికి గోదావరి జలాలను తీసుకొచ్చిన ఘనత దామన్నది. ఫ్లోరైడ్ సమస్యతో ఇబ్బంది పడుతున్న గ్రామాలకు మంచినీరు అందించిన గొప్ప నాయకుడు” అని కొనియాడారు. తుంగతుర్తిలోని గ్రామగ్రామాన ఆయన అభిమానులు ఉన్నారని గుర్తుచేశారు.
తెలంగాణ టైగర్: గాంధీ కుటుంబం అండగా:
దామోదర్ రెడ్డికి ఉన్న ప్రజాదరణను ఉద్దేశిస్తూ, ఆయన ‘తెలంగాణ టైగర్’గా పేరు తెచ్చుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.ఈ సందర్భంగా, దామోదర్ రెడ్డి కుటుంబానికి కాంగ్రెస్ అగ్రనాయకత్వం అండగా ఉంటుందని సోనియా గాంధీ చెప్పిన విషయాన్ని సీఎం రేవంత్ వెల్లడించారు. అలాగే, దామోదర్ రెడ్డి మృతికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ తమ సంతాప లేఖలను పంపారని ఆయన సభలో తెలియజేశారు. దామన్న మృతి కాంగ్రెస్ పార్టీకి, ఉమ్మడి నల్గొండ జిల్లాకు తీరని లోటని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.