Revanth Reddy: తెలంగాణ రాష్ట్రాన్ని అంతర్జాతీయ క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. భవిష్యత్తులో ఒలింపిక్స్ వంటి ప్రతిష్టాత్మక పోటీల్లో మన క్రీడాకారులు సత్తా చాటాలని, అందుకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించాలని అధికారులను ఆదేశించారు. సోమవారం క్రీడాశాఖపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనపై సీఎం సుదీర్ఘంగా చర్చించారు.
ముఖ్యంగా ‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలని సీఎం సూచించారు. క్రీడాకారులకు అవసరమైన అత్యాధునిక శిక్షణ, మైదానాలు, హాస్టల్ వసతులు ఒకే చోట ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. గచ్చిబౌలిలోని ఔట్‌డోర్ స్టేడియంను పునరుద్ధరించడంతో పాటు, అక్కడ కొత్తగా ఇండోర్ స్టేడియం, యూనివర్సిటీ కాంప్లెక్స్ వంటి భవనాల నిర్మాణానికి సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు. దీనికి సంబంధించిన వివిధ డిజైన్లను కూడా సీఎం స్వయంగా పరిశీలించారు.
హైదరాబాద్‌లోని ప్రముఖ స్టేడియాలైన ఎల్బీ స్టేడియం, కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం, సరూర్ నగర్ స్టేడియంలను కూడా ఆధునీకరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. భవిష్యత్తులో ఒలింపిక్స్, కామన్వెల్త్ గేమ్స్ వంటి పెద్ద పోటీలకు తెలంగాణ ఆతిథ్యం ఇచ్చేలా సిద్ధంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. క్రీడాకారులకు మెరుగైన శిక్షణ ఇచ్చి, వారిని అంతర్జాతీయ స్థాయి విజేతలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని రేవంత్ రెడ్డి తెలిపారు.
ఈ సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో పాటు క్రీడాశాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. క్రీడా రంగంలో తెలంగాణను అగ్రస్థానంలో నిలబెట్టేందుకు అవసరమైన కార్యాచరణను వేగవంతం చేయాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు.
