Revanth Reddy: అభివృద్ధి విషయంలో ఎవరికీ మినహాయింపు ఉండదని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆ మాటను చేతల్లో చేసి చూపించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. నాగర్‌కర్నూల్ జిల్లా, కొండారెడ్డిపల్లిలోని తన సొంత ఇంటి ప్రహరీ గోడ రోడ్డు విస్తరణకు అడ్డుగా రావడంతో, దాన్ని వెంటనే కూల్చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు రెండు రోజుల క్రితం అధికారులు ఆ ప్రహరీ గోడను కూల్చివేశారు.
అందరికీ ఒకే న్యాయం!
కొండారెడ్డిపల్లిలో చేపట్టిన 4 లేన్ల రోడ్డు నిర్మాణంలో భాగంగా మొత్తం 43 ఇళ్లను పాక్షికంగా కూల్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి తన ఇంటి గోడను కూడా కూల్చివేయాలని ఆదేశించడం ప్రజలను ఆకట్టుకుంది. ఈ విషయంపై అదనపు కలెక్టర్ దేవసహాయం మాట్లాడుతూ.. “రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోయే వారికి పరిహారం అందించాలని సీఎం రెండు నెలల క్రితమే మాకు ఆదేశాలిచ్చారు. ఆయన ఆదేశాల ప్రకారమే పనులు వేగవంతం చేశాం” అని వివరించారు.
గ్రామస్తుల ప్రశంసలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయాన్ని గ్రామస్తులు ఎంతగానో మెచ్చుకుంటున్నారు. “సీఎం అయినప్పటికీ.. ఎలాంటి భేదం లేకుండా తన ఇంటి గోడను కూడా కూల్చేయమని ఆదేశించడం గొప్ప విషయం” అని అభినందిస్తున్నారు. ప్రస్తుతం కూల్చిన ప్రహరీ గోడ పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ సంఘటన ముఖ్యమంత్రి నిజాయితీ, నిబద్ధతకు నిదర్శనమని ప్రజలు భావిస్తున్నారు.