CM Revanth Reddy

CM Revanth Reddy: నారాయణపేట జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

CM Revanth Reddy: నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో సోమవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. మక్తల్‌, ఆత్మకూరు ప్రాంతాల్లో వెయ్యి కోట్లకు పైగా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టేందుకు సీఎం ప్రత్యేక పర్యటనకు సిద్ధమయ్యారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరిన ఆయన మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఆత్మకూరు జాతర మైదానంలోని హెలిప్యాడ్‌కు చేరుకోనున్నారు.

ఆత్మకూరులోని పీజేపీ క్యాంపు కార్యాలయానికి వెళ్లిన అనంతరం కృష్ణా నదిపై జూరాల ప్రాజెక్టు దిగువన నిర్మించనున్న వంతెన పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. అలాగే అక్కడే 50 పడకల ఆస్పత్రి, ఇండోర్ స్టేడియం నిర్మాణం, మున్సిపాలిటీ పరిధిలో 15 కోట్ల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు.

Also Read: Liquor Policy: నేటి నుంచి కొత్త మ‌ద్యం దుకాణాలు

ఈ కార్యక్రమాల తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి మక్తల్‌కు వెళ్లి మక్తల్–నారాయణపేట మధ్య నాలుగు వరుసల రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు 210 కోట్ల వ్యయంతో చేపట్టబడుతోంది. అదనంగా, మక్తల్ మునిసిపాలిటీలో 15 కోట్ల రూపాయలతో నిర్మించనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ పనులకు కూడా శ్రీకారం చుట్టనున్నారు.

ఇదిలా ఉండగా, అత్యంత కీలకమైన నారాయణపేట–మక్తల్–కొడంగల్ ఎత్తిపోతల పథకం నిర్మాణ ప్రారంభానికి సీఎం రేవంత్‌రెడ్డి అంకురార్పణ చేయనున్నారు. దాదాపు 5 వేల కోట్ల రూపాయల వ్యయంతో రూపొందుతున్న ఈ పథకం ద్వారా లక్ష ఎకరాలపైగా సాగునీటిని అందించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

మక్తల్ పర్యటనలో భాగంగా సీఎం పడమటి ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం మక్తల్–నారాయణపేట రోడ్‌పై ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడానికి ఆయ‌న రెడీ అయ్యారు. పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను మంత్రి వాకిటి శ్రీహరి స్వయంగా పర్యవేక్షించగా, కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ వినీత్‌తో కలిసి అధికారులు కార్యక్రమ స్థలాలను పరిశీలించారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *