CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరోసారి ఢిల్లీకి పయనమయ్యారు. ఈ రోజు (ఆగస్టు 25) మధ్యాహ్నం ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఈ సారి కీలక అంశాలపై తాడోపేడో తేల్చుకునేందుకే ఆయన రాజధాని నగరానికి వెళ్తున్నట్టు సీఎంవో వర్గాల ద్వారా తెలుస్తున్నది. సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లడం ఈ సారితో కలిపి 52వ సారి అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నా, ఆయన మాత్రం కొన్ని కీలక అంశాలపై చర్చల కోసమే వెళ్తున్నారని సమాచారం.
CM Revanth Reddy: ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు, 42 శాతం బీసీ రిజర్వేషన్లు, ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత అంశాలపైనా న్యాయ నిపుణులు సలహాలు తీసుకునేందుకు ఆయన ఢిల్లీ వెళ్తున్నట్టు తెలుస్తున్నది. శాసనసభ ఆమోదించిన బీసీ రిజర్వేషన్ బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉండగా, ఇదే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్నది.
CM Revanth Reddy: ఈ నేపథ్యంలో అసలు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలా? వద్దా? అన్న అంశాలపై న్యాయ నిపుణుల సలహా తీసుకుంటారని తెలుస్తున్నది. అదే విధంగా బిల్లు పెండింగ్ అంశంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించాలా? వద్దా? అన్న విషయాలపై ఆయన న్యాయ సలహా తీసుకుంటారని సమాచారం. స్థానిక ఎన్నికలను సెప్టెంబర్ 30వ తేదీలోగా నిర్వహించాలన్న రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తేల్చాలనే పట్టుదలతో సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నట్టు సమాచారం.
CM Revanth Reddy: అదే విధంగా ఢిల్లీ పర్యటన అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి బీహార్ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని తెలుస్తున్నది. అక్కడ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టే పాదయాత్రలో సీఎం సహా, రాష్ట్ర మంత్రులు పలువురు పాల్గొంటారని సమాచారం. ఏదేమైనా ఈసారి ఢిల్లీ పర్యటనలో బీసీ రిజర్వేషన్ బిల్లు అంశంపై తాడో పేడో తేల్చుకుంటారని కాంగ్రెస్ వర్గాల ద్వారా తెలుస్తున్నది.