Revanth Reddy: ఆసియాలోనే అతిపెద్ద లైఫ్ సైన్సెస్ – హెల్త్‌టెక్ ఫోరమ్ ‘బయోఏషియా-2026’ సదస్సు నేడు హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో అత్యంత వైభవంగా ప్రారంభమైంది. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ఈ 23వ ఎడిషన్ సదస్సును అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణను ప్రపంచస్థాయి బయోటెక్ – ఫార్మా హబ్‌గా తీర్చిదిద్దేందుకు ‘తెలంగాణ రైజింగ్’ నినాదంతో ముందుకు వెళ్తున్నట్లు ప్రకటించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగంలోని ముఖ్యాంశాలు:
ముఖ్యమంత్రి తన ప్రారంభోపన్యాసంలో రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మరియు పారిశ్రామిక విధానాలపై స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను వివరించారు..
తెలంగాణను 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం పునరుద్ఘాటించారు. ఒకప్పుడు చార్మినార్, బిర్యానీకి గుర్తింపు పొందిన హైదరాబాద్, నేడు ప్రపంచవ్యాప్త వ్యాక్సిన్ తయారీ కేంద్రంగా ఎదిగిందని ఆయన గర్వంగా ప్రకటించారు. గత రెండు సంవత్సరాలలోనే లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణకు రూ. 73,000 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని, ఇది రాష్ట్ర పారిశ్రామిక విధానాలపై ఉన్న నమ్మకానికి నిదర్శనమని చెప్పారు. ప్రపంచస్థాయి గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లకు (GCC), పరిశోధన మరియు ఆవిష్కరణలకు హైదరాబాద్ సరైన వేదికని, ఇక్కడ పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహిస్తుందని హామీ ఇచ్చారు.
సదస్సు ప్రత్యేకతలు:
ఈ ఏడాది సదస్సు “టెక్‌బయో అన్‌లీష్డ్: ఏఐ, ఆటోమేషన్ & బయాలజీ రివల్యూషన్” అనే ఇతివృత్తంతో జరుగుతోంది.
500కు పైగా కంపెనీల నుండి సుమారు 4,000 మంది ప్రతి ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు.సదస్సులో భాగంగా 40 వర్ధమాన స్టార్టప్‌లు మరియు 16 ఆవిష్కరణ కేంద్రాలు (Innovation Pavilions) తమ నూతన సాంకేతికతలను ప్రదర్శిస్తున్నాయి. నోవార్టిస్, సనోఫీ, అమ్జెన్ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థల ప్రతినిధులు ఏఐ ఆధారిత ఔషధ తయారీపై కీలక ప్రసంగాలు చేస్తున్నారు.
