Revanth Reddy: భాగ్యనగరాన్ని ప్రపంచ స్థాయి నగరాలతో పోటీపడేలా తీర్చిదిద్దడమే లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆదివారం ప్రజా భవన్ లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, నగరాన్ని వేధిస్తున్న కాలుష్య సమస్య, రవాణా రంగంలో తీసుకురాబోయే విప్లవాత్మక మార్పులు ఇంకా మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుపై తన దార్శనికతను(Vision) పంచుకున్నారు. కాలుష్యం కారణంగా హైదరాబాద్ ‘నివసించడానికి వీలులేని నగరంగా’ (Non-living city) మారే ప్రమాదం ఉందని, దానిని అడ్డుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన హెచ్చరించారు.
రవాణా రంగంలో మార్పులు: ఎలక్ట్రిక్ వాహనాలే లక్ష్యం
హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేసింది.
-
ఎలక్ట్రిక్ బస్సులు: 2026 డిసెంబర్ నాటికి హైదరాబాద్ నగరంలో నడిచే ఆర్టీసీ బస్సులన్నీ వంద శాతం ఎలక్ట్రిక్ వాహనాలే ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం తెలిపారు.
-
ఆటోలు & స్కూటీలు: ప్రస్తుతం నడుస్తున్న పెట్రోల్, డీజిల్ ఆటోలను కూడా ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అంతేకాకుండా, విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు పంపిణీ చేసే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించారు.
-
పరిశ్రమల తరలింపు: కాలుష్యాన్ని తగ్గించేందుకు నగరంలోని పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్డు (ORR) వెలుపలకు తరలించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.
మూసీ పునరుజ్జీవనం: 13న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్
మూసీ నది ప్రక్షాళనపై వస్తున్న విమర్శలకు సీఎం ధీటుగా సమాధానమిచ్చారు.
-
డీపీఆర్ విడుదల: ఈ నెల 13వ తేదీన మూసీ పునరుజ్జీవనం మరియు దానికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR) పై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
-
ప్రతిపక్షాలకు సవాల్: దోమలను నియంత్రించాలంటారు కానీ మూసీని శుభ్రం చేయొద్దంటున్నారు.. అసలు మీరు ఈ ప్రాజెక్టుకు అనుకూలమో కాదో తేల్చి చెప్పండి అని ప్రతిపక్షాలను ప్రశ్నించారు.
-
బఫర్ జోన్లు: నదుల బఫర్ జోన్లలో ఎలాంటి కట్టడాలకు అనుమతులు లేవని, ఒకవేళ అక్కడ నిర్మాణాలు చేపట్టినా వాటిని తొలగించక తప్పదని హెచ్చరించారు. బఫర్ జోన్ పరిధిలోని ఇళ్లకు భవిష్యత్తులో విలువ ఉండదని ఆయన స్పష్టం చేశారు.
గాంధీ విగ్రహం పై దుష్ప్రచారం వద్దు
బాపు ఘాట్ వద్ద గాంధీ విగ్రహం ఏర్పాటుపై జరుగుతున్న ప్రచారాన్ని సీఎం ఖండించారు.
-
వాస్తవ ఖర్చు: గాంధీ విగ్రహం నిర్మాణానికి రూ. 500 కోట్లు ఖర్చవుతోందని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అసలు ఖర్చు కేవలం రూ. 70 కోట్లు మాత్రమేనని వివరించారు.
-
విజ్ఞాన కేంద్రం: గాంధీ విజ్ఞాన కేంద్రం (Center of Excellence) ఏర్పాటు కోసం రూ. 100 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు.
