Revanth Reddy: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ ప్రచార పర్వాన్ని స్పీడప్ చేసింది. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అక్కడ నుంచే పార్టీ నేతలతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ ఎన్నికలను పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, ప్రతి వార్డులోనూ కాంగ్రెస్ జెండా ఎగరడమే లక్ష్యంగా పనిచేయాలని ఆయన శ్రేణులకు పిలుపునిచ్చారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరియు ఇతర మంత్రులతో కలిసి ఆయన ఎన్నికల వ్యూహాలపై చర్చించారు.
ముఖ్యంగా అభ్యర్థుల ఎంపిక విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రత్యర్థి పార్టీలైన బీజేపీ, బీఆర్ఎస్లను తట్టుకుని నిలబడగలిగే బలమైన అభ్యర్థులనే బరిలోకి దించాలని సూచించారు. “మనకు ప్రతి డివిజన్, ప్రతి వార్డు గెలుపు చాలా ముఖ్యం” అని ఆయన నొక్కి చెప్పారు. నామినేషన్ల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో, ఇకపై క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవ్వాలని నేతలను ఆదేశించారు.
పార్టీలో అంతర్గత సమస్యలపై కూడా సీఎం కీలక సూచనలు చేశారు. టికెట్ దక్కక అసంతృప్తితో ఉన్న రెబల్ అభ్యర్థులతో మాట్లాడి, వారిని బుజ్జగించి పార్టీ గెలుపు కోసం పని చేసేలా చూడాలని మంత్రులకు, ఇన్ఛార్జ్లకు సూచించారు. పార్టీ ఎక్కడైతే బలహీనంగా ఉందో ఆ మున్సిపాలిటీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, నేతల మధ్య ఎటువంటి విభేదాలు లేకుండా కలిసికట్టుగా ముందుకు సాగాలని రేవంత్ రెడ్డి ఈ సమావేశంలో స్పష్టం చేశారు.
