Pashamylaram: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలంలోని పాశమైలారం పారిశ్రామిక వాడలో జరిగిన ఘోర రసాయన ప్రమాదం రాష్ట్రాన్ని కలచివేసింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 36కి చేరింది. క్షతగాత్రులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఈ ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాద స్థలాన్ని సందర్శించారు. సహాయక చర్యల పురోగతిని స్వయంగా పరిశీలించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులను పరామర్శించేందుకు కూడా సీఎం వెళ్లనున్నారు.
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా జిల్లా యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో స్పందిస్తోంది. జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి వివేక్, మంత్రి దామోదర రాజనర్సింహ కూడా ఈ ఉదయం ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. పారిశ్రామిక ప్రాంతాలలో భద్రతా ప్రమాణాలు పటిష్టంగా అమలవ్వాలని అధికారులు చెబుతున్నారు.
ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని సీఎం ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది.