Revanth Reddy: నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర జ్ఞాన సరస్వతి ఆలయం త్వరలోనే సరికొత్త రూపును సంతరించుకోనుంది. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ పర్యటనలో ఆయన కేవలం మొక్కులు చెల్లించుకోవడమే కాకుండా, బాసర క్షేత్రాన్ని యాదాద్రి తరహాలో గొప్పగా తీర్చిదిద్దేందుకు కీలక అడుగు వేశారు.
కుటుంబ సమేతంగా పూజలు – మనవడికి అక్షరాభ్యాసం
ఆదివారం బాసరకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డికి ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. ముందుగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన సీఎం, తన మనవడికి ఆలయ మండపంలో అక్షరాభ్యాసం చేయించారు. చదువుల తల్లి సన్నిధిలో తమ కుటుంబ సభ్యుడి విద్యాభ్యాసం ప్రారంభం కావడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
రూ. 225 కోట్లతో అభివృద్ధి పనుల ప్రారంభం
భక్తుల సౌకర్యార్థం, ఆలయ ప్రాశస్త్యాన్ని పెంచేందుకు రూ. 225 కోట్ల భారీ బడ్జెట్‌తో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి భూమిపూజ చేశారు. ఈ నిధులతో ఆలయ విస్తరణ, భక్తుల కోసం క్యూలైన్లు, వసతి గదులు, ఇతర మౌలిక సదుపాయాలను మెరుగుపరచనున్నారు. రాబోయే రోజుల్లో బాసర క్షేత్రం ఆధ్యాత్మికంగా మరింత శోభాయమానంగా మారనుంది.
ఆకట్టుకుంటున్న మాస్టర్ ప్లాన్ నమూనా
ఆలయ పునరభివృద్ధి కోసం ప్రభుత్వం ఇప్పటికే ఒక మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ఆలయ కొత్త నమూనా లోని ఒక భాగాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నమూనాలో ఆలయ నిర్మాణం ఎంతో భక్తిభావం ఉట్టిపడేలా, విశాలంగా కనిపిస్తోంది. పాత తనం ఉట్టిపడుతూనే, ఆధునిక సౌకర్యాలతో ఈ క్షేత్రాన్ని తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.
