Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో ఇకపై పదో తరగతి బోర్డు పరీక్షలను రద్దు చేయనున్నట్లు ఆయన కీలక ప్రకటన చేశారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఒకే రకమైన విద్యా విధానాన్ని అమలు చేయబోతున్నామని సీఎం స్పష్టం చేశారు. దీనివల్ల విద్యార్థులపై పరీక్షల ఒత్తిడి తగ్గి, వారు ఉన్నత చదువులపై మరింత శ్రద్ధ పెట్టే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రస్తుతం జాతీయ స్థాయిలో అమలులో ఉన్న విద్యా విధానం (+2 విధానం)పై ప్రభుత్వం ఇప్పటికే లోతైన అధ్యయనం చేస్తోంది. దీనిని అనుసరించి రాష్ట్రంలో కూడా మార్పులు చేయబోతున్నారు. అంటే, గతంలో లాగా పదో తరగతి ముగిసిన తర్వాత ప్రత్యేకంగా బోర్డు పరీక్షలు రాయాల్సిన అవసరం ఉండదు. నేరుగా ఇంటర్మీడియట్ రెండో సంవత్సరంలోనే బోర్డు పరీక్షలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ కొత్త విద్యా విధానాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచే రాష్ట్రవ్యాప్తంగా అమలులోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది.
తెలంగాణ విద్యా రంగంలో సమూల మార్పులు తీసుకురావడమే తమ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా మన విద్యావ్యవస్థను తీర్చిదిద్దడం వల్ల మన విద్యార్థులు ప్రపంచస్థాయిలో రాణించగలరని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యా విధానంలో మార్పులతో పాటు పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఈ ప్రకటనతో అటు విద్యార్థులు, ఇటు తల్లిదండ్రుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.
