cm revanth reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం మెదక్ జిల్లా జహీరాబాద్‌లో విస్తృత పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.494 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ముఖ్యంగా కేంద్రీయ విద్యాలయాన్ని ప్రారంభించడంతో పాటు, పస్తాపూర్‌లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ, జహీరాబాద్‌ను “గేట్‌వే ఆఫ్ ఇండస్ట్రీస్”గా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. పారిశ్రామికవాడ భూసేకరణలో జరిగిన అన్యాయంపై తన దృష్టికి వచ్చిందని పేర్కొంటూ, బాధిత భూ నిర్వాసితులకు తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
నిమ్జ్ బాధితులకు న్యాయం – ఇళ్లు, నష్టపరిహారం
“2014 తర్వాత నిమ్జ్ అభివృద్ధి స్థబ్దతకు లోనైంది. నిమ్జ్ కోసం భూములు ఇచ్చిన వారికి మేము ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తాం. భూమి కోల్పోయిన ప్రతి కుటుంబానికి తగిన నష్టపరిహారం పెంచాలని అధికారులను ఆదేశించాను. అవసరమైన నిధుల మంజూరులో ఎలాంటి అభ్యంతరం ఉండదు,” అని సీఎం స్పష్టం చేశారు.
ఇందిరాగాంధీ, మెదక్ అనుబంధం గుర్తు చేసిన సీఎం
మెదక్ జిల్లా ప్రజల అభిమానం, కాంగ్రెస్ పట్ల ప్రేమను గుర్తు చేసిన సీఎం రేవంత్ రెడ్డి, “మెదక్ ఎంపీగా ఇందిరాగాంధీ సేవలందించారు. ఆమె మెదక్‌నే తన రాజకీయ జీవితానికి వేదికగా ఎంచుకున్నారు. కాంగ్రెస్‌ను మెదక్ ప్రజలు ఎప్పుడూ గుర్తుంచుకుంటారు,” అని భావోద్వేగంతో తెలిపారు.
జహీరాబాద్ అభివృద్ధిలో గీతారెడ్డికి ప్రశంసలు
జహీరాబాద్ అభివృద్ధిలో మాజీ మంత్రి డాక్టర్ గీతారెడ్డి కీలక పాత్ర పోషించారని ముఖ్యమంత్రి కొనియాడారు. పారిశ్రామిక ప్రగతికి ఆమె చేసిన కృషిని సీఎం ప్రత్యేకంగా గుర్తు చేశారు.