CM Revanth Reddy::మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జాతీయ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’ ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. రాజ్యాంగాన్ని మార్చాలని మోదీ మొదటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. గజనీ మహమ్మద్ హిందుస్తాన్‌ను దోచుకోవడానికి చేసిన ప్రయత్నం లాగే మోదీ కూడా రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని, అయితే ఆయన ప్రయత్నం విఫలమవుతోందని పేర్కొన్నారు.
అప్పట్లో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా మహాత్మా గాంధీ దేశాన్ని రక్షించినట్లే, ఇప్పుడు భారతీయ జనతా పార్టీగా చలామణి అవుతున్న బ్రిటిష్ జనతా పార్టీని ఎదుర్కొనేందుకు రాహుల్ గాంధీ ముందుకు వచ్చారని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ యుద్ధంలో దేశం మొత్తం రాహుల్ గాంధీకి మద్దతుగా నిలవాలని, రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఇది ఎన్నికల ర్యాలీ కాదని, ఒక యుద్ధమని అన్నారు. గాడ్సే పరివార్ వైపు నుంచి మోదీ, గాంధీ పరివార్ వైపు నుంచి రాహుల్ గాంధీ పోరాడుతున్నారని, అందుకే మనం గాంధీ పరివార్‌తో కలిసి రాహుల్ గాంధీకి మద్దతు ఇవ్వాలని కోరారు.
రాహుల్ గాంధీ మాట్లాడుతూ, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసి రాజ్యాంగాన్ని రక్షించడమే లక్ష్యమని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని తొలగిస్తామని ప్రకటించారు. బీజేపీ-ఆర్ఎస్ఎస్ దేశాన్ని స్వాతంత్ర్యం పూర్వం నాటి పరిస్థితులకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాయని ఆయన ఆరోపించారు. పేదలను, దళితులను, వెనుకబడిన వర్గాలను, ఆదివాసీలను మరోసారి భానిసలుగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు.
బెట్టు నోట్ల రద్దు, జీఎస్టీ వంటి చర్యలు పేద ప్రజల జీవితాలను దెబ్బతీసి, బిలియనీర్లకు లాభం చేకూర్చే విధంగా రూపకల్పన చేయబడ్డాయన్నారు. దేశంలోని అదానీ, అంబానీ వంటి బిలియనీర్లు ఎంత ఎక్కువ సంపాదిస్తారో, సామాన్యులకు అంత తక్కువ ఉపాధి లభిస్తుందని రాహుల్ గాంధీ విమర్శించారు.