cm revanth reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మరియు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డి, కేటీఆర్‌కు లైజనింగ్ ఆఫీసర్లా వ్యవహరిస్తున్నారంటూ ఆయన ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ బీజేపీకి ఆర్గాన్ డొనేషన్ చేసినట్టే పరిస్థితి ఉందని, అందుకే బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో 8 ఎంపీ స్థానాలు గెలిచిందని రేవంత్ వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా, కిషన్ రెడ్డి కేటీఆర్‌కి ప్రైవేట్ ట్యూషన్ మాస్టర్‌గా పనిచేస్తున్నారని వ్యంగ్యంగా అన్నారు. రెండు పార్టీల మధ్య రహస్య ఒప్పందం కొనసాగుతుందని, బీజేపీ బీఆర్ఎస్ కోసం, బీఆర్ఎస్ బీజేపీ కోసం పని చేస్తోందని ఆరోపించారు. ఈ బంధమే మెదక్ లో బీఆర్ఎస్ ఓటమికి కారణమైందని చెప్పారు. అయినా ఈ పార్టీలకు ఇప్పటికీ బుద్ధి రావడం లేదని విమర్శించారు. ఇందుకు ముందు బనకచర్ల ప్రాజెక్టు గురించి మాట్లాడిన సీఎం, ఈ అంశంపై రెండు రాష్ట్రాలు కూర్చుని చర్చించుకుంటే ఎలాంటి వివాదం ఉండదన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీఎఫ్ఆర్ (Pre Feasibility Report) పంపడం వల్లే ఈ వివాదం తలెత్తిందని తెలిపారు. ఆ వెంటనే కేంద్రం కూడా స్పందించిందని అన్నారు.