Cm revanth: హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ జీవిత చరిత్ర ఆధారంగా రచించిన “ప్రజల కథే నా ఆత్మకథ” పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం శిల్పకలావేదికలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై, దత్తాత్రేయ జీవిత ప్రయాణాన్ని ప్రశంసలతో ముంచెత్తారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “దత్తాత్రేయ గారు ప్రజలతో తన అనుబంధాన్ని పుస్తకం రూపంలో పొందుపరిచారు. ఆయన నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమం, తెలంగాణ ఉద్యమానికి ఒక స్ఫూర్తిగా నిలిచింది,” అని అన్నారు.
గౌలిగూడ గల్లీ నుంచి హర్యాణా గవర్నర్ దాకా
“గౌలిగూడ గల్లీల్లో పుట్టి పెరిగిన దత్తాత్రేయ గారు దేశంలో అత్యున్నత పదవిలోకి ఎదిగారు. ఆయన జీవిత ప్రయాణం ఎంతో కష్టసాధ్యమైనదే అయినా, ప్రజలతో సంబంధాలు ఎప్పుడూ కోల్పోలేదు,” అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
“అలయ్ బలయ్” వంటి కార్యక్రమాలను పార్టీ Politics కి అతీతంగా నిర్వహించడం ఆయన వ్యక్తిత్వాన్ని చూపిస్తుందని కొనియాడారు.
సమగ్ర రాజకీయ నేత
ఈ కార్యక్రమానికి అన్ని పార్టీల నేతలు హాజరయ్యారన్న విషయం గమనించదగ్గదేనని రేవంత్ అన్నారు. “బండారు దత్తాత్రేయ బీజేపీ నేత అయినా, ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని పార్టీ పరంగా ఎవరూ చూడలేదు. ఆయనను ఒక మర్యాదపూరితమైన రాజకీయ నాయకుడిగా చూసే మానసికత అందరిలోనూ ఉంది,” అని పేర్కొన్నారు.
తరాలకో మార్గదర్శకుడు
రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “రాజకీయాల్లోకి కొత్తగా వచ్చే ప్రతి ఒక్కరూ ఈ ఆత్మకథ పుస్తకం చదవాల్సిన అవసరం ఉంది. ఆయన నుంచి ఎన్నో నేర్చుకోవాల్సి ఉంది. జాతీయ స్థాయిలో వాజ్‌పేయికి ఉన్న గౌరవం, రాష్ట్ర స్థాయిలో దత్తాత్రేయకు ఉంది,” అన్నారు.
పీజేఆర్ – దత్తాత్రేయ ప్రజల మనస్సుల్లో
పీజేఆర్, దత్తాత్రేయ వంటి నేతలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని, జంట నగరాల్లో ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు ముందుగా గుర్తుకు వచ్చే వారు వీరిద్దరే అని తెలిపారు. “ఇవాళ మేము తీసుకునే ప్రతి నిర్ణయంలో ఈ ఇద్దరి స్ఫూర్తి తప్పకుండా ఉంటుంది,” అని అన్నారు.
వినోదాత్మక వ్యాఖ్యలు
ముఖ్యమంత్రి తన ప్రసంగాన్ని ఉత్సాహంగా ముగిస్తూ – “స్కూల్ మోడీ దగ్గర చదువుకున్నా, కాలేజ్ చంద్రబాబు దగ్గర పూర్తి చేశా.. ఇప్పుడు ఉద్యోగం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దగ్గర చేస్తున్నా,” అని హాస్యాత్మకంగా వ్యాఖ్యానించి నవ్వులు పూయించారు.