Cm revanth: గ్రామాల అభివృద్ధికి అదనపు నిధులు ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఎన్నికలు పూర్తయ్యాయని, ఇక రాజకీయాలకంటే గ్రామాభివృద్ధే లక్ష్యమని చెప్పారు. పార్టీలు, పంతాలు పక్కనపెట్టి అందర్నీ కలుపుకుని వెళ్లాలని సర్పంచ్‌లకు సూచించారు.
చిన్న గ్రామాలకు రూ.5 లక్షలు, పెద్ద గ్రామాలకు రూ.10 లక్షలు ప్రత్యేక నిధులు అందిస్తామని తెలిపారు. ఈ నిధులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులకు అదనమని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతో సంబంధం లేకుండా సీఎం నుంచి నేరుగా గ్రామాలకు నిధులు అందుతాయని చెప్పారు. పక్క పార్టీ నుంచి గెలిచారనే వివక్ష చూపితే గ్రామాభివృద్ధి ఆగిపోతుందని హెచ్చరించారు.
ఇదే సమయంలో రాజకీయ అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. డీలిమిటేషన్‌లో సీట్లు పెరిగితే 100కు పైగా సీట్లు గెలుస్తామని, రెండింతల మెజార్టీతో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబాన్ని మళ్లీ అధికారంలోకి రానివ్వనని శపథం చేశారు.
జూబ్లీహిల్స్‌లో ఓడించామని, పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను పూర్తిగా ఓడించామని వ్యాఖ్యానించారు. కేటీఆర్‌ను ఉద్దేశించి “నువ్వెంత, నీ స్థాయి ఎంత… నేను నీకు భయపడతానా?” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2029 ఎన్నికల్లో 80 శాతానికి పైగా సీట్లతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు.
