Cm revanth: ఉగాది పండుగను పురస్కరించుకుని, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు ఉచిత సన్న బియ్యం పథకాన్ని (Free Rice Scheme) హుజూర్ నగర్ వేదికగా ప్రారంభించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఈ పథకాన్ని ప్రారంభించి, భారీ జనసమావేశంలో ప్రసంగించారు.
సన్న బియ్యం పథకం
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, “చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టాం. భవిష్యత్తులో ఎవరూ దీన్ని రద్దు చేయలేరు” అని స్పష్టం చేశారు. నల్లగొండ జిల్లా దేశంలోనే అత్యధికంగా సన్న వడ్లను పండిస్తుందని, మరిన్ని నీటి వనరులు అందిస్తే మరింత ఉత్పత్తి సాధ్యమని ఆయన చెప్పారు.
ఎస్ఎల్బీసీ సొరంగం పై
ఎస్ఎల్బీసీ సొరంగం (SLBC Tunnel) గురించి ప్రస్తావించిన సీఎం, గత బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Govt) పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. “44 కిలోమీటర్ల సొరంగంలో 34 కిలోమీటర్లు పూర్తయ్యాయి. కానీ, గత పది సంవత్సరాల్లో ఒక్క అడుగు ముందుకు వేయలేకపోయారు. నల్లగొండ ప్రజలపై బీఆర్ఎస్ ప్రభుత్వానికి కోపం ఉండటమే ఇందుకు కారణం” అని ఆరోపించారు. త్వరలో ఈ ప్రాజెక్టును పూర్తి చేసి, నల్లగొండ జిల్లా ప్రజలకు నీటి సదుపాయం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై విమర్శలు
రాష్ట్రంలో అవినీతికి చిహ్నంగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టును “కూళేశ్వరం” అని విమర్శిస్తూ, “ఈ అవినీతి వల్లే ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తిరస్కరించారు. ఫామ్ హౌస్ పాలిటిక్స్ కు ప్రజలు తగిన శిక్ష విధించారు” అని వ్యాఖ్యానించారు.
సన్న బియ్యం ద్వారా పేదలకు మేలు
ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) పేదలకు ఆహార భద్రత కల్పించడానికేనని, దీన్ని 70 ఏళ్ల క్రితమే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. “దొడ్డు బియ్యం పథకం ద్వారా ప్రతి ఏడాది రూ. 10 వేల కోట్ల దోపిడీ జరుగుతోంది. మిల్లర్ల మాఫియాకు లాభం కలిగించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నించింది. కానీ, పేదల కోసం సన్న బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టినది కాంగ్రెస్ ప్రభుత్వమే,” అని అన్నారు.
సోనియా గాంధీ ఆహార భద్రతా చట్టం
“పేదల ఆకలిని తీర్చిన తల్లి సోనియమ్మ,” అంటూ సోనియా గాంధీ (Sonia Gandhi) గురించి ప్రస్తావించారు. పేదల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆహార భద్రతా చట్టం ద్వారా లక్షలాది మందికి మేలు జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. “గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం సన్న బియ్యం గురించి ఆలోచించిందా?” అని ప్రశ్నిస్తూ, పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడిఉందని చెప్పారు.

