CM revanth: వేసవి నేపథ్యంలో రాబోయే మూడు నెలల పాటు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లు, ఇరిగేషన్ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టుల కింద సాగు అవుతున్న పంటలకు ప్రణాళిక ప్రకారం నీటిని విడుదల చేయాలని సూచించారు.
ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ఎండలు తీవ్రంగా పెరిగే అవకాశం ఉన్నందున ముందస్తుగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు
అధికారులు క్షేత్ర స్థాయికి వెళ్లి పరిస్థితులను సమీక్షించాలని, రైతులు ఇబ్బంది పడకుండా, వారి పంటలు ఎండిపోకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
కృష్ణా జలాలను వినియోగించే విషయంలో అప్రమత్తంగా ఉండాలని, నిర్ణీత కోటా కంటే ఎక్కువ నీటిని ఆంధ్రప్రదేశ్ తరలించకుండా అడ్డుకోవాలని స్పష్టం చేశారు. దీనికి టెలిమెట్రీ విధానాన్ని అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.

