Cm revanth: మొంథా తుపాన్ ప్రభావం నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ముఖ్యంగా వరి కోతల సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి, ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు.
సీఎం మాట్లాడుతూ, ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలపై తుపాన్ ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి, ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి అని అధికారులను ఆదేశించారు.
అదేవిధంగా, చెరువులు, వాగులు, వంకల దగ్గర ఇసుక బస్తాలు సిద్ధంగా ఉంచాలి, కాజ్‌వేలపై వాహనాల రాకపోకలను నిషేధించాలి అని సూచించారు. అవసరమైన చోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం, పునరావాస కేంద్రాల్లో తాగునీరు, ఆహారం, ఆరోగ్య సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
మొత్తం రాష్ట్ర యంత్రాంగం తుపాన్ పరిస్థితులను తక్షణం ఎదుర్కొనేలా సిద్ధంగా ఉండాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.
