Cm revanth: “పాలమూరుకి కేసీఆర్ ఇచ్చింది ఏమిటో చెప్పాలి”

Cm revanth: పదేళ్ల పాటు పాలనలో ఉన్నప్పటికీ పాలమూరు ప్రాంతానికి న్యాయం చేయకపోవడం కేసీఆర్‌కి చెల్లదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. శుక్రవారం నాగర్‌కర్నూల్‌ జిల్లా సభలో మాట్లాడిన ఆయన, “గుండెల్లో పెట్టి చూసుకున్న పాలమూరు గడ్డకు కేసీఆర్ ఏమిచ్చారు?” అనే ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

98వ జీవో ప్రకారం నిర్వాసితుల పునరావాసం కోసం చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కేసీఆర్‌కే ఉండిందని గుర్తు చేస్తూ, పదేళ్ల పాలనలో ఎందుకు ఆదుకోలేకపోయారు? అని నిలదీశారు. వాల్మీకి సోదరులను ఎస్టీ బోయలుగా మారుస్తానని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు.

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేయకపోవడమే కాకుండా, కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా ప్రాజెక్టులు కూడా నిర్లక్ష్యానికి గురయ్యాయని ఆయన విమర్శించారు. “లక్ష కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి కట్టిన కాళేశ్వరం మూడేళ్లలో కూలేశ్వరం అయింది,” అంటూ ఘాటుగా ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంటు ఉండదంటూ బీఆర్‌ఎస్ చేసిన ప్రచారాన్ని తప్పుబట్టారు. “ప్రస్తుతానికి రైతులకు 24 గంటల ఉచిత కరెంటు అందిస్తున్నారు. వరి కొనుగోళ్లలో బోనస్ ఇస్తూ, ప్రతి గింజ కొంటున్నాం,” అన్నారు.

మొదటి ఏడాదిలోనే రూ.21 వేల కోట్ల రైతు రుణమాఫీ, 9 రోజుల్లో రూ.9 వేల కోట్ల ‘రైతు భరోసా’ పథకం అమలు చేసినట్టు తెలిపారు. స్వయం సహాయక సంఘాలకు బలాన్నిచ్చేందుకు రుణాలు అందిస్తున్నామని, ‘అమ్మ ఆదర్శ పాఠశాలల’ నిర్వహణ బాధ్యతను కూడా మహిళలకే అప్పగించామని వెల్లడించారు.

ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ల ద్వారా ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. కేసీఆర్ పాలనకు ప్రజలు గుణపాఠం చెబుతున్నారని, నూతన పాలనతో తెలంగాణలో కొత్త శకం మొదలైందని స్పష్టం చేశారు.

 

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *