Cm revanth: జీఎస్టీ 2.0: తెలంగాణకు రూ.7,000 కోట్ల నష్టం

 

Cm revanth: సవరించిన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) రేట్లు సోమవారం నుంచి అమల్లోకి రాకతో తెలంగాణ రాష్ట్రానికి సుమారు రూ.7,000 కోట్ల భారీ నష్టం ఎదురవుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాలపై ఇలాంటి భారాలు మోపుతూ కేంద్రం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం సరైన పద్ధతి కాదని ఆయన విమర్శించారు. ఈ నష్టాన్ని కేంద్రమే భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

సింగరేణి ఉద్యోగులకు బోనస్ ప్రకటించేందుకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఓ ప్రశ్నకు సమాధానంగా సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. కొత్త జీఎస్టీ విధానం వల్ల తగ్గే ఆదాయాన్ని పూడ్చేందుకు కేంద్రం ఐదేళ్ల పాటు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (VGF) అందించాలని ఆయన కోరారు. “జీఎస్టీ శ్లాబుల్లో మార్పుల వల్ల ఆదాయం కోల్పోయే రాష్ట్రాలను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది” అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసుకున్న ఆదాయం ప్రకారమే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయని, ఇప్పుడు ఈ నష్టం వాటిపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన వివరించారు. ఈ సమస్యను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లి, తెలంగాణకు నష్టపరిహారం ఇవ్వాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. అలాగే, డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క కూడా కేంద్రానికి లేఖ రాశారని తెలిపారు.

గతంలో జీఎస్టీ ప్రవేశపెట్టినప్పుడు 14 శాతం పైగా ఆదాయం కోల్పోయిన రాష్ట్రాలకు కేంద్రం VGF ప్రకటించిందని, ఇప్పుడు రెండో దశ సవరణల్లోనూ అదే విధానాన్ని ఐదేళ్ల పాటు కొనసాగించాలని రేవంత్ రెడ్డి సూచించారు.

సెప్టెంబర్ 3న ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ ఆందోళనలను వ్యక్తం చేశారు. జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణ వల్ల రాష్ట్రాల ఆదాయం తగ్గితే విద్య, వైద్యం వంటి నిత్యావసర సేవలు, సంక్షేమ పథకాలపై తీవ్ర ప్రభావం పడుతుందని, నిధుల కొరత వల్ల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు నిలిచిపోతాయని ఆయన ఆ సమావేశంలోనే హెచ్చరించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *