Cm revanth: భారత చలనచిత్ర రంగానికి తీరని లోటు

Cm revanth: భారతీయ చలనచిత్ర రంగంలో రారాజుగా వెలుగొందిన ప్రముఖ నటుడు ధర్మేంద్ర మరణం అత్యంత బాధాకరమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక అధికారిక సందేశంలో పేర్కొన్నారు. విభిన్న పాత్రలు పోషిస్తూ, తనదైన నటనతో సినీప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న విలక్షణ నటుడు ధర్మేంద్ర మృతితో భారత చలనచిత్ర రంగానికి తీరని లోటు ఏర్పడిందని ఆయన అన్నారు.

ధర్మేంద్ర ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తం చేశారు. ఆరు దశాబ్దాలకు పైగా భారతీయ సినిమా పరిశ్రమలో నిరంతరం రాణించిన ధర్మేంద్ర, యాక్షన్, రొమాన్స్, భావోద్వేగ పాత్రల్లో తనదైన ముద్ర వేశారు.

వృద్ధాప్య సమస్యలు, తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందులతో ధర్మేంద్ర సోమవారం తుదిశ్వాస విడిచారు. 1935 డిసెంబరు 8న పంజాబ్‌లోని నస్రలీ గ్రామంలో జన్మించిన ఆయన, 1960లో దిల్ భీ తేరా హమ్ భీ తేరా చిత్రంతో సినీరంగంలో అడుగుపెట్టారు. కెరీర్ ప్రారంభ దశలో సాఫ్ట్, రొమాంటిక్ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న ధర్మేంద్ర, 1970వ దశకంలో స్టార్ హీరోగా స్థిరపడ్డారు.

ఆంఖే, షికార్, మేరా గావ్ మేరా దేశ్, యాదోంకీ బారాత్, దోస్త్, షోలే, ధరమ్ వీర్ వంటి అనేక విజయవంతమైన చిత్రాలతో ఆయన బహుముఖ నటన ప్రేక్షకుల మనసుల్లో శాశ్వత స్థానం సంపాదించింది. ఆయన మరణవార్త తెలిసిన వెంటనే సినిమా పరిశ్రమతో పాటు రాజకీయ రంగంలోని పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ధర్మేంద్ర మృతి వార్త విన్న అభిమానులు తీవ్ర విచారంలో మునిగిపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *