Cm revanth: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో, సీఎం రేవంత్ రెడ్డి బోరబండలో భారీగా నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన గత రాజకీయ పరిణామాలు, ప్రస్తుత ఎన్నికల పరిస్థితిని వివరించారు.
రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “తెలంగాణలో ప్రజలు తమ నిర్ణయం చెప్పేశారు. బీఆర్‌ఎస్ పార్టీని, కేసీఆర్ కుటుంబాన్ని ప్రజలు కారును షెడ్డు పెట్టినట్లుగా రాజకీయాల్లో పక్కనపెట్టారు. ఇక జూబ్లీహిల్స్‌లో బిల్లా రంగాల్లో తిరిగే పెద్దల కాలం అయిపోయింది. ఇప్పుడు పేదల ఆశల కాలం మొదలైంది” అని వ్యాఖ్యానించారు.
అలాగే, పీజేఆర్ మరణించిన సమయంలో జరిగిన రాజకీయ పరిస్థితులను గుర్తు చేస్తూ, “పేదల దేవుడు పీజేఆర్ కన్నుమూసినప్పుడు, ఆయన కుటుంబ సభ్యుడిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని అన్ని పార్టీలూ నిర్ణయించాయి. టీడీపీ కూడా అంగీకరించింది. కానీ ఆ సమయంలో కేసీఆర్ మాత్రం ఈ నిర్ణయాన్ని గౌరవించకుండా ఎన్నికలో పోటీ అభ్యర్థిని నిలబెట్టారు. ప్రజల భావాలను పక్కన పెట్టి, రాజకీయ లాభం కోసం చర్యలు చేపట్టారు” అని ఆరోపించారు.
రాష్ట్రంలో ప్రజల సంక్షేమం కోసం తాము తీసుకుంటున్న చర్యలను వివరించిన రేవంత్ రెడ్డి, రాబోయే ఉప ఎన్నికల్లో ప్రజలు ప్రభుత్వానికి మరింత బలం ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఆయన వ్యాఖ్యలకు సభలో ఉన్న పెద్ద సంఖ్యలో ప్రజలు స్పందించారు.

