CM Chandrababu: పల్నాడు జిల్లా, మాచర్లలో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో మాచర్లలో ప్రజాస్వామ్యం పూర్తిగా కనుమరుగైందని, అరాచకాలు, నేరాలు పెచ్చుమీరాయని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇకపై అలాంటి చర్యలను ప్రభుత్వం సహించదని, ఎవరైనా రౌడీయిజం, నేరాలకు పాల్పడితే చూస్తూ ఊరుకోబోమని ఆయన గట్టిగా హెచ్చరించారు.
అరాచకాలను అంతం చేస్తాం:
గతంలో రాయలసీమలో ముఠాలను పూర్తిగా అంతం చేశామని, ఇప్పుడు పల్నాడులో కూడా శాంతిభద్రతలు నెలకొల్పుతామని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజలపై దాడులు చేయడం, వారి ఆస్తులను ధ్వంసం చేయడం వంటి చర్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రజల ఆస్తులను రక్షించడం ప్రభుత్వ బాధ్యత అని ఆయన అన్నారు.
Also Read: Drugs Smuggling: శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్ పట్టివేత.. రూ.12 కోట్ల విలువైన గంజాయి సీజ్
చెత్త రాజకీయాలకు చెల్లుచీటి:
రాష్ట్రంలో పేరుకుపోయిన చెత్తను తొలగించడంతో పాటు, చెత్త రాజకీయాలను కూడా క్లీన్ చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. గత ప్రభుత్వం 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను రోడ్లపై వేసిందని, అంతేకాకుండా చెత్తపై పన్ను కూడా వేసిందని ఆయన ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే చెత్త పన్నును రద్దు చేశామని, ఈ చెత్తను పూర్తిగా తొలగించే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుందని ఆయన తెలిపారు.
ప్రజల సంక్షేమమే లక్ష్యం:
తనలాంటి నాయకులే గతంలో మాచర్లకు రాలేని పరిస్థితి ఉండేదని, ఇప్పుడు ఎవరైనా స్వేచ్ఛగా రాగలుగుతున్నారని చంద్రబాబు అన్నారు. తాము ప్రవేశపెట్టిన ‘సూపర్ సిక్స్’ పథకాలతో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా మహిళల కోసం ప్రవేశపెట్టిన ‘తల్లికి వందనం’, ‘స్త్రీశక్తి’ పథకాలను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా, వారందరికీ ‘తల్లికి వందనం’ ద్వారా ఆర్థిక సాయం అందిస్తామని, మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించామని, అంతేకాకుండా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా ఇస్తున్నామని ఆయన వివరించారు. ఈ సంక్షేమ పథకాలతో ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే తమ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు.