Free Bus Travel Scheme: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మహిళా శక్తి సాధికారతకు మరో పెద్ద అడుగుగా ‘స్త్రీ శక్తి’ పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం అందుబాటులోకి రానుంది.
ప్రారంభోత్సవానికి ముందుగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దత్తాత్రేయ మాధవ్ తదితరులు ఆర్టీసీ మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులో ప్రయాణించారు. ఉండవల్లి గుహల వద్ద నుంచి తాడేపల్లి, కనకదుర్గ వారధి మీదుగా విజయవాడ సిటీ టెర్మినల్ వరకు ఈ ప్రత్యేక బస్సు ప్రయాణం కొనసాగింది.
బస్సు వెళ్లే మార్గం అంతా పండుగ వాతావరణాన్ని తలపించింది. అడుగడుగునా మంగళహారతులు, బాణసంచా, డీజే సంగీతం, తీన్మార్ డ్యాన్స్‌లతో ప్రజలు, ముఖ్యంగా మహిళలు హర్షధ్వానాలు చేశారు. “థాంక్యూ సీఎం సర్” అంటూ నినాదాలు చేశారు. పథకంపై ఆనందం వ్యక్తం చేయడానికి మహిళలు పెద్ద ఎత్తున రోడ్లకు ఇరువైపులా క్యూలుగా నిలబడి స్వాగతం పలికారు.
ఇది కూడా చదవండి: Kavita: కేసీఆర్ ఫామ్ హౌస్ కి కవిత
ప్రయాణంలో సీఎం చంద్రబాబు మహిళలతో ముచ్చటిస్తూ, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఆర్టీసీ సిబ్బంది చేతుల మీదుగా జీరో ఫేర్ టికెట్లను మహిళలకు అందజేశారు. ఈ సదుపాయాన్ని రాష్ట్రంలోని ప్రతి మహిళ తప్పనిసరిగా వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
కాసేపట్లో విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో జెండా ఊపి ‘స్త్రీ శక్తి’ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.