CM Chandrababu

CM Chandrababu: సీఎం చంద్రబాబు: సత్యసాయి సేవలు మానవ రూపంలో మనం చూసిన దైవస్వరూపం

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీ సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలలో పాల్గొన్నారు. పుట్టపర్తిలోని హిల్‌వ్యూ స్టేడియంలో నిర్వహిస్తున్న ఈ వేడుకలకు హాజరైన సీఎం, సత్యసాయి సేవలను, సిద్ధాంతాలను స్మరించుకుంటూ ప్రసంగించారు. మానవ రూపంలో మనం చూసిన దైవస్వరూపం శ్రీ సత్యసాయి అని ముఖ్యమంత్రి కొనియాడారు.

సాయి సిద్ధాంతం, ప్రపంచవ్యాప్త సేవలు
సత్యసాయి ఒక ఉద్దేశంతో లోకానికి వచ్చి, ఆ లక్ష్యం కోసమే జీవించారని సీఎం చంద్రబాబు అన్నారు. సత్యం, ధర్మం, ప్రేమ, శాంతి, అహింస సిద్ధాంతాలుగా ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించారని తెలిపారు. తన బోధనలతో కోట్ల మందిని ప్రభావితం చేయగలిగారని, క్రమశిక్షణ, ప్రేమ, సేవాభావం గురించి సత్యసాయిబాబా చెప్పారని గుర్తు చేశారు. భగవాన్ సాయి సిద్ధాంతం దేశ, విదేశాలకు విస్తరించిందని, ప్రేమ సిద్ధాంతాన్ని మనమంతా అర్థం చేసుకోవాలని సీఎం అన్నారు. వివిధ దేశాల అధినేతలు వచ్చి బాబాను దర్శించుకున్నారని, ఈ వేడుకలకు కేంద్ర మంత్రులు, అనేక హైకోర్టులకు సంబంధించిన చీఫ్ జస్టిస్ లు కూడా హాజరవడం సాయి సిద్ధాంత జ్ఞానాన్ని ముందుకు తీసుకు వెళ్లాలనే నమ్మకాన్ని సూచిస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

Also Read: CM Revanth Reddy: పుట్టపర్తిలో సీఎం రేవంత్‌రెడ్డి: సత్యసాయి సేవలు ప్రభుత్వాల కంటే గొప్పవి

కుల, మతాలకు అతీతంగా నిస్వార్థ సేవ
1960లో బాబా స్థాపించిన శ్రీసత్యసాయి బాబా సంస్థలతో సేవలకు ఒక నిర్దిష్టమైన రూపం వచ్చిందని చంద్రబాబు తెలిపారు. సత్యసాయి తన మహిమలతో అన్ని మతాలు ఒక్కటేనని భక్తులకు ప్రత్యక్షంగా నిరూపించారని, సకల జనుల సంక్షేమాన్ని కోరుకున్నారని అన్నారు. సత్యసాయిబాబా ట్రస్టు ద్వారా కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా నిస్వార్థ సేవలను ప్రపంచవ్యాప్తం చేశారని, దీనికి నిలువెత్తు రూపమయ్యారని సీఎం పేర్కొన్నారు.

ట్రస్టు సేవలు, ఆర్థిక సహాయం
సత్యసాయిబాబా సంస్థల ద్వారా అందుతున్న సేవలను సీఎం వివరించారు.

ప్రస్తుతం 102 సత్యసాయిబాబ పాఠశాలల్లో 60 వేల మంది చదువుతున్నారు.
ట్రస్టు ఆసుపత్రుల ద్వారా రోజుకు 3 వేల మందికిపైగా రోగులకు ఉచితంగా చికిత్స అందుతోంది.
ప్రజల దాహార్తిని తీర్చడానికి రూ.550 కోట్లు ఖర్చు పెట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులోని 1600 గ్రామాలకు 30 లక్షల మందికిపైగా తాగునీరు అందించారు.
7 లక్షల 50 వేలమంది యాక్టివ్‌ సేవాదళ్‌ సభ్యులు సేవలో భాగమయ్యారు.

సత్యసాయి ఇంటర్నేషనల్‌ ఆర్గనైజేషన్‌ 10 జోన్లుగా ప్రపంచ దేశాల్లో సాయి సేవలను ముందుకు తీసుకెళ్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. ఇలాంటి పవిత్రమైన కార్యక్రమంలో తాను భాగస్వామ్యం కావడం తన పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నానని, ఈ పవిత్రమైన పుణ్యభూమిని ప్రపంచానికి ఒక శక్తివంతమైన ప్రాంతంగా తయారు చేయడానికి స్థానికుల సహకారం అవసరమని చంద్రబాబు అన్నారు. తెలుగు రాష్ట్రాలకు, ప్రపంచంలోని ప్రజలందరికీ మంచి జరగాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *