Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం పేదలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ, ప్రతి నెలా ఒకటవ తేదీన పింఛన్ల పంపిణీని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు ( డిసెంబర్ 1న) ఏలూరు జిల్లాలో పలు కార్యక్రమాలలో పాల్గొననున్నారు
ఈరోజు ఏలూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఉదయం 10.30 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి, 10.55 గంటలకు ఉంగుటూరు మండలం గొల్లగూడెంకు చేరుకుంటారు. అక్కడ అధికారులతో, ప్రజా ప్రతినిధులతో సమావేశం అయిన తర్వాత, 11.10 గంటలకు గోపినాథపట్నం చేరుకుంటారు. గోపినాథపట్నంలోనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా ‘ఎన్టీఆర్ భరోసా’ పెన్షన్ల పంపిణీ జరగనుంది. సీఎం చంద్రబాబు స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లను అందజేసి, వారి కుటుంబ సభ్యులతో ముఖాముఖి మాట్లాడనున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు.
క్యాడర్‌కు దిశానిర్దేశం, వైసీపీ అరాచకాలపై పోరాటం
గోపినాథపట్నం కార్యక్రమం అనంతరం, ఉదయం 11.40 గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు నల్లమాడకు చేరుకుని, అక్కడ ఏర్పాటు చేసిన ప్రజావేదిక బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా P4 మార్గ దర్శకులు మరియు బంగారు కుటుంబాలతో ముఖాముఖి నిర్వహించే అవకాశం ఉంది. మధ్యాహ్నం 2 గంటలకు నల్లమాడ నుంచి బయలుదేరి గొల్లగూడెం చేరుకుని, అక్కడ స్థానిక తెలుగుదేశం పార్టీ క్యాడర్‌తో సమావేశమవుతారు.
ఈ సమావేశంలో పార్టీ శ్రేణులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. గతంలో జరిగిన ఒక కార్యక్రమంలో, వైసీపీ పాలకుల అరాచకాలు, అవినీతి గురించి రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరగాలని, వాటిని గ్రౌండ్ స్థాయిలో ప్రజల వద్దకు తీసుకెళ్లాలని టీడీపీ కార్యకర్తలకు చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Elon Musk: అమెరికా ఎదగడానికి కారణమే.. భారత యువకులు
పార్టీ కోసం కష్టపడిన ప్రతీ ఒక్కరినీ గుర్తించి, నామినేటెడ్ పోస్టులు ఇచ్చి గౌరవిస్తామని, తగిన న్యాయం చేస్తామని ఈ సందర్భంగా ఆయన భరోసా ఇచ్చారు. అదే సమయంలో, పార్టీలో తప్పుడు కార్యక్రమాలకు పాల్పడితే ఏమాత్రం సహించేది లేదని, “తాట తీస్తాన” ని పరోక్షంగా హెచ్చరించారు.
రాబోయే ఉగాది నాటికి రాష్ట్రంలో ఐదు లక్షల ఇళ్లను ప్రజలకు అప్పగించబోతున్నట్లు కూడా ముఖ్యమంత్రి వివరించారు. నేటి పర్యటన అనంతరం, మధ్యాహ్నం 3.35 గంటలకు హెలికాప్టర్‌లో ఆయన ఉండవల్లి నివాసానికి తిరుగు పయనం అవుతారు. ఏలూరు పర్యటన షెడ్యూల్ మొత్తం పకడ్బందీగా ఖరారైంది. చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా నేడు ప్రారంభం కాబోతున్న పెన్షన్ల పంపిణీ కార్యక్రమం, పేద ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై మరింత నమ్మకాన్ని పెంచే అంశంగా పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

