Chandrababu Naidu: ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్ తీరుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ఎంపీ చేసిన తప్పు వల్ల పార్టీ మొత్తం సమాధానం చెప్పుకోవాల్సి రావడం దురదృష్టకరమని ఆయన మండిపడ్డారు. మంగళవారం తిరుపతి జిల్లా ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి ఈ అంశంపై ఘాటుగా స్పందించారు. పార్టీలో క్రమశిక్షణ తప్పేవారు ఎంతటి వారైనా సరే, వారిని భరించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.
యువతకు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేశారు..
2024 ఎన్నికల్లో యువతను ప్రోత్సహించాలనే మంచి ఉద్దేశంతో మహేశ్ యాదవ్కు ఎంపీ సీటు ఇచ్చి గెలిపించుకున్నామని చంద్రబాబు గుర్తుచేశారు. కానీ, బాధ్యతాయుతమైన పదవిలో ఉండి డ్రగ్స్ వంటి వివాదాల్లో చిక్కుకోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. మంచి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చి కూడా ఇలాంటి పనులకు పాల్పడటం సరికాదని హితవు పలికారు. ప్రజల కోసం పనిచేయాల్సిన వారు తమకు వచ్చిన గొప్ప అవకాశాన్ని ఇలాంటి దురలవాట్లతో పాడు చేసుకోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.
క్రమశిక్షణే ముఖ్యం: ఎవరికీ మినహాయింపు లేదు!
తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ అనేది అందరికీ సమానమేనని, ఎవరికీ ప్రత్యేక వెసులుబాటు ఉండదని చంద్రబాబు తేల్చి చెప్పారు. గతంలో కూడా తప్పు చేసిన వారిపై కఠిన నిర్ణయాలు తీసుకున్నామని, ఇప్పుడు కూడా అదే పంథా కొనసాగుతుందని హెచ్చరించారు. తప్పులు చేస్తూ పార్టీకి నష్టం కలిగించే వారిని మోయాల్సిన అవసరం పార్టీకి లేదని ఆయన కచ్చితంగా చెప్పారు. నాయకులందరూ క్రమశిక్షణతో మెలగాలని, ప్రజల్లో పార్టీ గౌరవాన్ని పెంచేలా ప్రవర్తించాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు.
