CM Chandrababu

CM Chandrababu: దావోస్ పర్యటన ముగించుకుని స్వదేశానికి సీఎం చంద్రబాబు!

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన నాలుగు రోజుల స్విట్జర్లాండ్ పర్యటనను అత్యంత విజయవంతంగా ముగించుకుని స్వదేశానికి చేరుకుంటున్నారు. ప్రపంచ ఆర్థిక సదస్సు (దావోస్) వేదికగా రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించిన ఆయన, శుక్రవారం ఉదయం  హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి వెంటనే గన్నవరం బయల్దేరి ఉదయం 10:30 గంటలకు చేరుకుంటారు. అనంతరం 11:30 గంటలకు సచివాలయానికి చేరుకుని, వెంటనే ఎస్‌ఎల్‌బీసీ (SLBC) కీలక సమావేశంలో పాల్గొని అధికారిక విధులను ప్రారంభించనున్నారు.

ఈ దావోస్ పర్యటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతిలో ఒక కీలక మైలురాయిగా నిలవనుంది. కేవలం మూడు రోజుల చర్చల ద్వారానే గ్రీన్ ఎనర్జీ, కృత్రిమ మేధ (AI), వ్యవసాయం, పర్యాటక రంగాల్లో సుమారు రూ.2.50 లక్షల కోట్ల పెట్టుబడులు ఖరారయ్యాయని ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ఏపీలోని వనరులు, ప్రభుత్వ పాలసీలను ప్రపంచ పారిశ్రామిక దిగ్గజాలకు వివరించడంలో ఈ వేదిక ఎంతగానో దోహదపడిందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్, ఐబీఎం సీఈఓ అర్వింద్ కృష్ణ, ఆర్సెలర్ మిట్టల్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్ వంటి 16 మంది అంతర్జాతీయ స్థాయి పారిశ్రామికవేత్తలతో ఆయన జరిపిన భేటీలు రాష్ట్రానికి కొత్త వెలుగులు తీసుకురానున్నాయి.

Also Read: Mahesh Kumar goud: రాబోయేది బీసీ నేత ముఖ్యమంత్రి

పర్యటనలో భాగంగా టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్‌తో జరిగిన భేటీ రాష్ట్రానికి మరిన్ని ప్రయోజనాలను చేకూర్చింది. విశాఖలో టీసీఎస్ డెవలప్‌మెంట్ సెంటర్, అమరావతిలో క్వాంటం వ్యాలీ, కర్నూలులో సోలార్ పవర్ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని టాటా గ్రూపు హామీ ఇచ్చింది. అంతేకాకుండా, రాష్ట్రంలో మూడు స్పోర్ట్స్ సిటీల నిర్మాణంపై కూడా సానుకూల చర్చలు జరిగాయి. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కార్యకలాపాల కోసం టాటా ట్రస్ట్ నుండి ప్రత్యేక అధికారులను పంపేందుకు కూడా అంగీకారం కుదిరింది.

మొత్తంగా 36కు పైగా కార్యక్రమాల్లో పాల్గొన్న చంద్రబాబు, ఇజ్రాయెల్, యూఏఈ, స్విట్జర్లాండ్ వంటి దేశాల ప్రతినిధులతో చర్చలు జరిపారు. ‘బ్రాండ్ ఆంధ్రప్రదేశ్’ను గ్లోబల్ స్థాయిలో నిలబెట్టడమే కాకుండా, యూరప్‌లోని తెలుగువారితో మమేకమై వారిలో స్ఫూర్తిని నింపారు. అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూల ద్వారా ఏపీ పెట్టుబడులకు స్వర్గధామమని చాటిచెప్పారు. ఈ పర్యటన ద్వారా అందిన పెట్టుబడులు రాష్ట్ర యువతకు భారీగా ఉపాధి అవకాశాలను కల్పిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *