CM Chandrababu

CM Chandrababu: ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మకు సీఎం చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పణ

CM Chandrababu: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు దంపతులు దర్శించుకున్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో అత్యంత పవిత్రమైన రోజు, అమ్మవారి జన్మ నక్షత్రమైన మూల నక్షత్రం కావడంతో, దుర్గమ్మ ఈ రోజు శ్రీ సరస్వతి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని, సీఎం దంపతులు ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

సీఎంకు పూర్ణకుంభంతో స్వాగతం..!
మధ్యాహ్నం 3:30 గంటలకు ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి దంపతులకు ఆలయ అధికారులు, మంత్రులు, వేద పండితులు మేళ తాళాలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. చినరాజగోపురం వద్ద స్థానాచార్యులు శివ ప్రసాద్‌శర్మ సీఎంకు పరివేష్టం (పవిత్ర వస్త్రం) కట్టగా, వారు సతీసమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పసుపు, కుంకుమ, పూలు, పండు, గాజులు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం పూర్తి కాగానే, వేద పండితులు సీఎం దంపతులకు ఆశీర్వచనం ఇవ్వగా, దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అమ్మవారి లడ్డూ ప్రసాదం, చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), జిల్లా కలెక్టర్ లక్ష్మీశ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

రాష్ట్ర సుభిక్షం కోసం అమ్మవారిని కోరాను..
అమ్మవారి దర్శనం తర్వాత మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఈ పవిత్రమైన రోజున దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించడం సంతోషంగా ఉందని తెలిపారు. రాష్ట్రం చల్లగా ఉండాలని, అమ్మ అనుగ్రహం ప్రజలందరిపై ఉండాలని తాను అమ్మవారిని కోరుకున్నానని తెలిపారు. ముఖ్యంగా, కృష్ణా నది పరవళ్లతో పాటు రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లు 94 శాతం మేర నిండి, రాష్ట్రం సుభిక్షంగా ఉందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. భక్తులు అందరూ సుఖ సంతోషాలతో ఉండి వారి సంపద పెరగాలని కోరుకున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు దాదాపు 8 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని సీఎం తెలిపారు.

Also Read: Rammohan Naidu: విజయవాడ ఎయిర్‌పోర్టులో ఉడాన్‌ యాత్రీ కేఫ్‌ ప్రారంభించిన రామ్మోహన్‌ నాయుడు

ఆలయ అభివృద్ధి పనులపై సీఎం ప్రకటన
భక్తులకు ఇబ్బందులు లేకుండా దర్శనాలు కల్పించడానికి సాధారణ భక్తుల దర్శనానికి అధిక సమయం కేటాయిస్తున్నామని సీఎం తెలిపారు. ఆలయ అభివృద్ధి కోసం మరిన్ని పనులు చేపడుతున్నట్లు ఆయన వివరించారు:

అన్నప్రసాద భవనం: రూ. 25 కోట్లతో 1500 మంది భక్తులు భోజనం చేసే సామర్థ్యం గల భవనం నిర్మాణం ఆరు నెలల్లో పూర్తవుతుంది.

ప్రసాదం తయారీ కేంద్రం: రూ. 27 కోట్లతో నిర్మించే ఈ కేంద్రం పనులు 3 నెలల్లో పూర్తవుతాయి.

పూజా మండపం: ప్రధాన ఆలయం వద్ద రూ. 5.5 కోట్లతో పూజా మండపం నిర్మాణాన్ని చేపడుతున్నామని, దాతల సహకారంతో యాగశాల కూడా ఏర్పాటు చేస్తున్నామని సీఎం తెలిపారు.

అలాగే, 2027లో గోదావరి, 2028లో కృష్ణమ్మ పుష్కరాల నిర్వహణకు కూడా సన్నాహాలు చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. దసరా పండుగ అంటే విజయవాడ ఉత్సవాలు గుర్తుకు వచ్చేలా ఘనంగా నిర్వహిస్తున్నామని ఆయన వివరించారు.

ముఖ్యమంత్రి ‘స్త్రీ శక్తి సూపర్ సిక్స్’ పథకం సూపర్ హిట్ అయిందని, పండుగలకు మహిళలు పెద్ద సంఖ్యలో వస్తుండడం సంతోషంగా ఉందన్నారు. మహిళా శక్తి ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. అలాగే, టెక్నాలజీని ఉపయోగించి ఆడబిడ్డలకు మరింత రక్షణ కల్పిస్తామని, తప్పు చేసే రౌడీలపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *