Chandrababu Naidu

Chandrababu Naidu: తిరుమల లడ్డూ వివాదం.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!

Chandrababu Naidu: తిరుమల శ్రీవారి ప్రసాదమైన లడ్డూ తయారీలో వాడే నెయ్యి కల్తీ జరిగిందనే అంశంపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘాటుగా స్పందించారు. గత ప్రభుత్వ హయాంలో తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా అనేక నిర్ణయాలు తీసుకున్నారని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా కల్తీ నెయ్యి సరఫరా వెనుక ఒక పెద్ద ‘సిండికేట్’ పనిచేసిందని, సుమారు 59.71 లక్షల కేజీల నెయ్యిని కల్తీ చేసి, దాదాపు 234.51 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అక్రమంగా దోచుకున్నారని ముఖ్యమంత్రి గణాంకాలతో సహా వివరించారు.

ఈ కల్తీ వ్యవహారంలో కేవలం నాణ్యత లోపించడమే కాకుండా, ప్రమాదకరమైన రసాయనాలను వాడటం అత్యంత ఆందోళనకరమని సీఎం పేర్కొన్నారు. తక్కువ ధరకే నెయ్యి సరఫరా చేస్తున్నారంటేనే దాని వెనుక ఏదో కుట్ర లేదా అవినీతి ఉంటుందని గ్రహించాలని ఆయన అన్నారు. ఇంత జరుగుతున్నా గత పాలకులు తప్పును ఒప్పుకోకుండా బుకాయిస్తున్నారని, గతంలో పనిచేసిన ఇద్దరు టీటీడీ చైర్మన్లే కల్తీ జరిగిన మాట వాస్తవమేనని అంగీకరించారని చంద్రబాబు గుర్తుచేశారు.

గత ప్రభుత్వం కేవలం ప్రసాదం విషయంలోనే కాకుండా, తిరుమల పవిత్రతకు భంగం కలిగించేలా అనేక చర్యలకు పాల్పడిందని సీఎం విమర్శించారు. ఆర్టీసీ బస్సు టికెట్లపై అన్యమత ప్రచారం చేయడం నుంచి, రామతీర్థంలో విగ్రహాల ధ్వంసం వరకు అన్నిటినీ ఆయన ప్రస్తావించారు. తప్పు చేసిన వారు క్షమాపణలు చెప్పాల్సింది పోయి, ఎదురు దాడి చేయడం సరికాదని మండిపడ్డారు. భక్తుల మనోభావాలతో ఆడుకున్న వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *