Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. కొత్త ఏడాది ఆరంభంలోనే రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు రావడం శుభపరిణామమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆనందం వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా ప్రభుత్వం అమలు చేస్తున్న వినూత్న పాలసీలు, సంస్కరణల వల్లే పారిశ్రామికవేత్తల్లో నమ్మకం పెరిగిందని ఆయన పేర్కొన్నారు. దేశంలోనే స్వదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో ఏపీ మొదటి స్థానంలో నిలవడం రాష్ట్ర అభివృద్ధికి నిదర్శనమని ఆయన కొనియాడారు.
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే నినాదంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుండటం వల్ల పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. గతంలో ఏదైనా పరిశ్రమ పెట్టాలంటే నెలల తరబడి వేచి చూడాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. పెట్టుబడిదారులకు కావాల్సిన అనుమతులు, సౌకర్యాలను ప్రభుత్వం వేగంగా కల్పిస్తోంది. ముఖ్యంగా పరిశ్రమలకు ఇచ్చే ప్రోత్సాహకాల్లో ఎలాంటి అవినీతి లేకుండా, పారదర్శకత కోసం ఎస్క్రో విధానాన్ని ప్రవేశపెట్టడం వల్ల ఇన్వెస్టర్లలో భరోసా పెరిగింది.
ప్రతి రంగానికి సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన విధానాలను రూపొందించింది. సాఫ్ట్‌వేర్ నుండి తయారీ రంగం వరకు ఏ పారిశ్రామికవేత్తకు ఏ విధమైన సహకారం కావాలో ప్రభుత్వం ముందే ప్రణాళికలు సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి విజన్‌ను నమ్మి ఆంధ్రప్రదేశ్‌కు వస్తున్న ఇన్వెస్టర్లకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కేవలం ఒకే బృందం కాకుండా, ప్రభుత్వంలోని ప్రతి విభాగాం సమన్వయంతో పనిచేయడం వల్లే ఈ విజయం సాధ్యమైందని ఆయన ప్రశంసించారు.
ఈ విజయం కేవలం ఆరంభం మాత్రమేనని, భవిష్యత్తులో ఏపీని దేశంలోనే అగ్రగామిగా నిలపడమే లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. స్థిరమైన అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ బాధ్యత అని చెప్పారు. మరిన్ని కొత్త పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
