Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే తీర్మానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుదీర్ఘంగా ప్రసంగించారు. అమరావతి అనేది కేవలం ఒక ప్రాంతం కాదని, అది ప్రజల ఆకాంక్షలతో ముడిపడి ఉన్న “ప్రజా రాజధాని” అని ఆయన స్పష్టం చేశారు. చారిత్రక నేపథ్యం ఉన్న అమరావతిని శాతవాహనులు కూడా పాలించారని, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న ఈ ప్రాంతాన్ని రాజధానిగా అభివృద్ధి చేయడం మనందరి బాధ్యతని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే అమరావతికి చట్టబద్ధత కల్పించడం అత్యవసరమని, అందుకే ఈ తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నామని ఆయన వెల్లడించారు. ఈ తీర్మానానికి అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలపడం ఒక చారిత్రక ఘట్టం.
హైదరాబాద్ అభివృద్ధిని ఉదాహరణగా చూపిస్తూ, ఆంధ్రప్రదేశ్‌కు కూడా అమరావతి అగ్రస్థానంలో నిలవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. గతంలో తాను వేసిన ఐటీ పునాదుల వల్లే నేడు తెలంగాణకు 75 శాతం ఆదాయం హైదరాబాద్ నుంచే వస్తోందని, అదే తరహాలో అమరావతిని స్వయం ఆధారిత ప్రాజెక్టుగా తీర్చిదిద్దుతామని చెప్పారు. విభజన తర్వాత కార్యాలయాలు లేక బస్సుల్లో పాలన సాగించిన పరిస్థితుల నుంచి, కేవలం 9 నెలల్లోనే సచివాలయం, అసెంబ్లీ భవనాలను పూర్తి చేశామని గుర్తు చేశారు. అమరావతి నిర్మాణం పూర్తయితే రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని, 2028 నాటికి మెజార్టీ పనులు పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రస్తుతం సుమారు 56 వేల కోట్ల రూపాయల విలువైన పనులు రాజధానిలో వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.
గత వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల ముందు అమరావతికి మద్దతు ఇచ్చిన జగన్, అధికారంలోకి వచ్చాక ‘ఊసరవెల్లి’ రాజకీయాలు చేస్తూ మూడు రాజధానుల కుట్రకు తెరలేపారని మండిపడ్డారు. ప్రపంచ బ్యాంకుకు లేఖలు రాయడం, పంట పొలాలకు నిప్పు పెట్టడం వంటి చర్యలతో అమరావతిపై విషం చిమ్మారని ధ్వజమెత్తారు. “ఒక్క ఛాన్స్” ఇవ్వడం వల్ల రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని, ఆ విధ్వంసకర పాలన వల్లే వైసీపీ 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఇకపై రాజారెడ్డి రాజ్యాంగం నడవదని, కేవలం అంబేద్కర్ రాజ్యాంగమే అమలవుతుందని హెచ్చరించారు. అమరావతిని ఎవరూ తాకలేరని, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల శాశ్వత రాజధానిగా వెలుగొందుతుందని ఆయన ప్రకటించారు.
