Amaravati: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో తన వ్యక్తిగత నివాస నిర్మాణాన్ని అధికారికంగా ప్రారంభించారు. రాజధాని అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిన ఆయన, స్వయంగా అక్కడ నివాసం ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
గత సంవత్సరం వెలగపూడి రెవెన్యూ పరిధిలోని రైతు కుటుంబం నుండి అయిదు ఎకరాల స్థలాన్ని సీఎం చంద్రబాబు కొనుగోలు చేశారు. సచివాలయం వెనుక ఉన్న E9 రహదారి పక్కనే, రాజధాని ప్రధాన ప్రాంతంలో ఈ నివాస నిర్మాణం చేపట్టనున్నారు.
ఈరోజు జరిగిన భూమి పూజ కార్యక్రమంలో సీఎం కుటుంబ సభ్యులు, మంత్రి నారా లోకేష్ దంపతులు పాల్గొన్నారు. వేద పండితుల ఆధ్వర్యంలో సాంప్రదాయ వైదిక పద్ధతిలో శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ముఖ్యమంత్రి సతీమణి నారా భువనేశ్వరి, లోకేష్ సతీమణి బ్రాహ్మణి కూడా ఈ వేడుకలో భాగమయ్యారు.
ఇది కూడా చదవండి: Repo Rate: రుణాలు తీసుకున్న వారికి ఆర్బీఐ గుడ్ న్యూస్.. మీ EMI లు తగ్గే ఛాన్స్!
భూమి పూజ అనంతరం నిర్మాణ సంస్థ ప్రతినిధులు ఇంటి నిర్మాణ ప్రణాళికను సీఎం చంద్రబాబుకు వివరించారు. 1,455 చదరపు గజాల విస్తీర్ణంలో G+1 నిర్మాణంగా ఇంటిని తీర్చిదిద్దనున్నారు. ఇందులో అధికారిక నివాసం తో పాటు కాన్ఫరెన్స్ హాల్ వంటి ఆధునిక సౌకర్యాలు కూడా కల్పించనున్నారు.
ఈ ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత వచ్చే ఏడాదిలోపు గృహప్రవేశం చేయాలని సీఎం చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు. స్థానికంగా నివాసం ఏర్పాటు చేసుకోవడాన్ని రైతులు హర్షంగా స్వాగతించారు.