CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన కుప్పం పర్యటనలో భాగంగా ఈరోజు (రెండో రోజు) మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తామని పునరుద్ఘాటించిన ఆయన, రైతులను అన్ని విధాలా ఆదుకునే ప్రభుత్వం తమదని హామీ ఇచ్చారు. ప్రతిపక్షం చేస్తున్న ‘శవ రాజకీయాలు’, నిరాధార ఆరోపణలపై సీఎం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
రైతు సంక్షేమంపై సీఎం దృష్టి :
ఈ ఏడాది రికార్డు స్థాయిలో దిగుబడి వచ్చిందని గుర్తు చేసిన సీఎం, ప్రపంచంలో మారుతున్న ఆహారపు అలవాట్లకు అనుగుణంగా పంటలు పండించడంపై దృష్టి సారించాలని రైతులకు సూచించారు. “ఏ పంట పండిస్తే లాభదాయకమో ఆలోచిస్తున్నాం. ఫుడ్ ప్రాసెసింగ్, ఇంటర్నేషనల్ మార్కెటింగ్‌పై చర్చలు జరుగుతున్నాయి. ఆధునిక పద్ధతుల ద్వారా వ్యవసాయంలో లాభాలు పెరుగుతాయి” అని చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వంలో రైతుల కోసం కనీసం డ్రిప్ సామాగ్రి కూడా ఇవ్వలేదని, కేవలం వాటాలు వసూలు చేసిన వారే ఇప్పుడు రైతుల గురించి మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. తమ ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు.
‘ఇంటింటికి’ పాలన, సంక్షేమ పథకాలు
సుపరిపాలనలో తొలి అడుగుగా ఇంటింటికి వెళ్తున్నామని, ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా తల్లులకు ‘తల్లికి వందనం’ పథకం కింద ప్రయోజనం అందిస్తున్నామని సీఎం తెలిపారు. అనర్హులకు పింఛన్లు తొలగిస్తే కూడా ప్రతిపక్షం రాజకీయం చేస్తోందని మండిపడ్డారు.
శాంతిపురం మండలం తుమ్మిశి గ్రామంలో జరిగిన ‘ప్రజా వేదిక’ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. “నన్ను మీరు (కుప్పం ప్రజలు) తొమ్మిదిసార్లు గెలిపించారు. రాష్ట్ర ప్రజల ఆశీర్వాదంతో నాలుగుసార్లు ముఖ్యమంత్రిని అయ్యాను. నేను ఎప్పుడైనా నేరాలు చేశానని, ఎవరినైనా కొట్టానని, హత్య చేశానని విన్నారా? హత్యా, శవ రాజకీయాలు నేను చేయను. సేవ, ప్రజాహితమే పరమావధిగా పనిచేస్తా. నాది అభివృద్ధి, సంక్షేమ యజ్ఞం. కొందరు రాక్షసుల్లా వచ్చి భగ్నం చేయాలని చూస్తున్నారు. వారిని వదిలిపెట్టను” అని చంద్రబాబు తీవ్రంగా హెచ్చరించారు.
Also Read: Mahaa Conclave On Education: జగన్ VS లోకేష్.. ప్రభుత్వ పాఠశాలలో ఎవరి మార్క్ ఎంత
ప్రస్తుత రాజకీయాలు నేరమయం అయ్యాయని చంద్రబాబు ఆరోపించారు. ఒక బాబాయిని చంపి, ఆయన కుమార్తెతోనే “మా అన్న మంచివాడని” చెప్పించారని, నిజం తెలిసిన తర్వాత ఆమె తిరగబడ్డారని పరోక్షంగా జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సొంత పార్టీ కార్యకర్త కారు కింద పడి చనిపోతే, కుక్కపిల్లను తీసేసినట్లు పక్కన పడేసి వెళ్లారని, మానవత్వం లేని వ్యక్తులు ఇంకా ఆటలాడుతున్నారని ముఖ్యమంత్రి మండిపడ్డారు. సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్లక పోవడం వల్లే బాధితుడు చనిపోయాడని, ఇప్పుడు అతని భార్యను బెదిరించి, “భర్త కారు కింద పడలేదు, అంబులెన్స్‌లో ఏదో జరిగింది” అని ప్రచారం చేయిస్తున్నారని ఆక్షేపించారు. కోడికత్తి, గులకరాయి దాడులకు తననే కారణమన్నారని, తన జీవితంలో ఇన్ని డ్రామాలు చూడలేదని అన్నారు. “నీతిమాలిన వాళ్లు, రౌడీలు రాజకీయాల్లో ఉన్నారు. చిల్లి గవ్వ కూడా ఖర్చు చేయని వాళ్లు మాట్లాడుతున్నారు. దోచుకోవడమే తప్ప ఇవ్వడం తెలియని వాళ్లతో రాజకీయం చేయాల్సి వస్తోంది” అని చంద్రబాబు ధ్వజమెత్తారు.
P4 పథకం, ప్రాజెక్టులపై స్పష్టత
P4 పథకంలో పేదలను ఆదుకోవడానికి వచ్చిన వారిపైనా విమర్శలు చేయడం ఏమిటని సీఎం ప్రశ్నించారు. పేదలను ఆదుకోకపోగా, ముందుకు వచ్చిన వారిపై విమర్శలు తగవన్నారు. బనకచర్ల ప్రాజెక్టు వల్ల ఎవరికీ నష్టం లేదని, సముద్రంలోకి పోయే నీళ్లను వాడుకుంటే రాష్ట్రాలు బాగుపడతాయని చంద్రబాబు పేర్కొన్నారు. తెలంగాణలో ప్రాజెక్టులపై తాను ఎప్పుడూ వ్యతిరేకించలేదని, నీటి సమస్య పరిష్కారమైతే తెలుగు ప్రజలు బాగుంటారని అభిప్రాయపడ్డారు.
అభివృద్ధి పనుల ప్రారంభం, ఒప్పందాలు
ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా రూ.1,207.90 కోట్లతో చేపట్టిన పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల శిలాఫలకాలను ఆవిష్కరించారు. రూ.1,617 కోట్లతో పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందాలు కుదిరాయి. కుప్పం నియోజకవర్గ అభివృద్ధి, నైపుణ్య శిక్షణపై నాలుగు కంపెనీలతో ఎంవోయూలు చేసుకున్నారు. 3,041 మందికి కొత్తగా వితంతు, దివ్యాంగ పింఛన్లు, వెయ్యి మందికి దీపం పథకం కింద వంట గ్యాస్ పంపిణీ చేశారు. P4లో భాగంగా 50 కుటుంబాలను హిందాల్కో సంస్థ దత్తత తీసుకుంది.