CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఈ రోజు విశాఖపట్నంలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ పర్యటనల ద్వారా పాలనను, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన :
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు విశాఖపట్నంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. నగరంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి జీవీఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డబుల్ డెక్కర్ బస్సులను ఆయన ప్రారంభించనున్నారు. ఈ ‘హోప్ ఆన్.. హోప్ ఆఫ్’ బస్సులు ఆర్కే బీచ్ నుంచి కైలాసగిరి, రుషికొండ, తొట్లకొండ వంటి పర్యాటక ప్రాంతాలకు తిరుగుతాయి. దీనితో పాటు, ఆయన నోవాటెల్‌లో ఇండియా ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సమ్మిట్లో, రాడిసన్ బ్లూ హోటల్‌లో గ్రీఫిన్ ఫౌండర్ నెట్‌వర్క్స్ మీటింగ్లో పాల్గొంటారు. సాయంత్రం, ఆయన విశాఖ నుంచి తన సొంత నియోజకవర్గమైన కుప్పంకు బయలుదేరనున్నారు. అక్కడ ఆయన హంద్రీనీవా సుజల స్రవంతి కాలువ పైలాన్‌ను ఆవిష్కరించి, జలహారతి కార్యక్రమంలో పాల్గొంటారు.
పవన్ కళ్యాణ్, నారా లోకేష్ కార్యక్రమాలు :
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పటికే విశాఖలో ఉన్నారు. నేడు ఆయన ‘సేనతో సేనాని’ కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతారు. అనంతరం పార్టీ అనుబంధ విభాగాలతో కూడా భేటీ అవుతారు.
మంత్రి నారా లోకేష్ కూడా రెండు రోజుల పర్యటనలో భాగంగా విశాఖలో ఉండనున్నారు. ఆయన ‘అర్థసమృద్ధి 2025- ఐసీఏఐ నేషనల్ కాన్ఫరెన్స్’లో, అలాగే ఎయిరోస్పేస్ మానుఫ్యాక్చరింగ్పై జరిగే అంతర్జాతీయ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరవుతారు. చంద్రంపాలెం జెడ్‌పీ హైస్కూల్‌లో ఏఐ ల్యాబ్‌ను ప్రారంభించనున్నారు. సాయంత్రం భారత మహిళా క్రికెట్ జట్టుతో మర్యాదపూర్వకంగా సమావేశం కానున్నారు.