CM Chandrababu: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో శనివారం నాడు సరికొత్త చరిత్రకు నాంది పలికారు. పర్యావరణ హితమే లక్ష్యంగా చేపట్టిన వినూత్న కార్యక్రమం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించి రాష్ట్రానికే గర్వకారణంగా నిలిచింది.
కుప్పం గడ్డపై అరుదైన ప్రపంచ రికార్డు
నియోజకవర్గ పర్యటనలో రెండో రోజైన శనివారం, ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఏకంగా 5,555 మంది డ్వాక్రా మహిళలకు ఈ-సైకిళ్లను పంపిణీ చేశారు. కేవలం 24 గంటల వ్యవధిలో ఇంత భారీ స్థాయిలో ఎలక్ట్రిక్ సైకిళ్లను పంపిణీ చేయడం ప్రపంచంలోనే ఇదే తొలిసారి కావడంతో, ఈ ఘనత గిన్నిస్ రికార్డుగా నమోదైంది. గిన్నిస్ బుక్ ప్రతినిధులు స్వయంగా ఈ అరుదైన రికార్డును ధ్రువీకరిస్తూ, చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్‌కు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు.
సైకిల్‌పై 3 కిలోమీటర్ల ర్యాలీ
ఈ సందర్భంగా శివపురం నుంచి తులసినాయనపల్లి ప్రజావేదిక వరకు సుమారు 3 కిలోమీటర్ల మేర నిర్వహించిన ఈ-సైకిళ్ల ర్యాలీలో ముఖ్యమంత్రి స్వయంగా పాల్గొని సైకిల్ తొక్కారు. వేలాది మంది మహిళలతో కలిసి ఆయన ఉత్సాహంగా సాగడం అక్కడి ప్రజల్లో కొత్త జోష్ నింపింది. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, ప్రజలు సైకిల్ గుర్తుకు ఓటేశారని, అందుకే అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తున్నానని గర్వంగా ప్రకటించారు.
Also Read: Revanth Reddy: మున్సిపల్ పోరు.. అమెరికా నుంచే సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం!
పైసా ఖర్చు లేని ‘సూపర్ సైకిల్’
ఈ ఈ-సైకిళ్ల ప్రత్యేకతలను వివరిస్తూ ముఖ్యమంత్రి వీటిని ‘సూపర్ సైకిల్స్’ గా అభివర్ణించారు. ఇంటిపై ఏర్పాటు చేసుకునే సోలార్ విద్యుత్ ద్వారా వీటిని ఛార్జింగ్ చేసుకోవచ్చని, ఒక్క పైసా ఖర్చు లేకుండా ఎక్కడికైనా వెళ్లవచ్చని తెలిపారు. ఇది మహిళల ఆర్థికాభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుందని, పర్యావరణాన్ని కాపాడుతూనే శారీరక వ్యాయామానికి కూడా ఉపయోగిస్తుందని ఆయన సూచించారు.
సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా కింద దేశంలో మరే రాష్ట్రం ఇవ్వనంత భారీ స్థాయిలో పెన్షన్లు అందిస్తున్నామని, ప్రతి నెలా రూ. 2,730 కోట్లు దీనికోసం వెచ్చిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌ను రద్దు చేశామని, ప్రజల భూములకు ఆధునిక టెక్నాలజీతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేస్తున్నామని హామీ ఇచ్చారు. హంద్రీనీవా ప్రాజెక్టును పూర్తి చేసి అనంతపురం, కుప్పం ప్రాంతాలకు కృష్ణా జలాలను తీసుకువచ్చామని, త్వరలోనే రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా మారుస్తామని చెప్పారు. తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ వంటి సూపర్ సిక్స్ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని, భవిష్యత్తులో మహిళలు రాజకీయాల్లోనూ పెద్ద ఎత్తున రాణించాలని ఆకాంక్షించారు.
మంచి పనులు చేస్తేనే సుఖంగా నిద్ర పడుతుందని, తప్పులు చేసిన వారికి ఆ భయమే వెంటాడుతుందని గత పాలకులనుద్దేశించి ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. అభివృద్ధికి కుప్పం నుంచే శ్రీకారం చుట్టామని, రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి విప్లవాత్మక మార్పులు తెస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.
Took an e-cycle for a spin around Kuppam today, joined by fellow cycling enthusiasts. Loved it! pic.twitter.com/6GKCDmK05Q
— N Chandrababu Naidu (@ncbn) January 31, 2026
