Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం అనంతపురం జిల్లాలో పర్యటించారు. జిల్లాలోని యాడికి మండలంలో నిర్వహించిన సాగునీటి వినియోగదారుల సంఘాలు మరియు రైతులతో జరిగిన ముఖాముఖి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాగునీటి సంఘాలకు దిశానిర్దేశం చేస్తూ, రాయలసీమను ఉద్యానవన హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. భూగర్భ జలాల పెంపుదల, మైక్రో ఇరిగేషన్ ప్రాధాన్యతను రైతులకు వివరిస్తూ భవిష్యత్తు ప్రణాళికలను ప్రకటించారు.
భూమినే ఒక జలాశయంగా మార్చాలి
రాయలసీమలో నీటి విలువ ప్రతి ఒక్కరికీ తెలుసని, అందుకే భూమినే ఒక జలాశయంగా భావించి నీటి సంరక్షణ చేపట్టాలని సీఎం పిలుపునిచ్చారు.
పరిగెత్తే నీటిని నడిపించాలి.. నడిచే నీటిని భూమిలోకి పంపాలి అనే నినాదంతో భూగర్భ జలాలను పెంచాలని సూచించారు. అనంతపురంలో భూగర్భ జలమట్టాన్ని 11.25 మీటర్లకు తీసుకువచ్చామని, దీనివల్ల కరెంటు ఖర్చులు కూడా తగ్గుతాయని పేర్కొన్నారు.
రాష్ట్రంలో 90 శాతం రాయితీతో డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు ఇస్తున్నామని, మైక్రో ఇరిగేషన్‌లో దేశంలోనే ఏపీ నంబర్‌వన్‌గా ఉందని గుర్తుచేశారు. రాబోయే ఆరేళ్లలో హార్టీకల్చర్ కోసం రూ. 30 వేల కోట్లు ఖర్చు చేస్తామని ప్రకటించారు.
పోలవరం మరియు ప్రాజెక్టుల పూర్తికి డెడ్‌లైన్
రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై చంద్రబాబు స్పష్టమైన హామీ ఇచ్చారు. 2027 పుష్కరాల కంటే ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. గత 21 నెలల్లో పోలవరం డయాఫ్రం వాల్‌ను కొత్తగా నిర్మించామని తెలిపారు. వంశధార, నాగావళి, చంపావతి ప్రాజెక్టులను కూడా యుద్ధప్రతిపాదికన పూర్తి చేస్తామని వెల్లడించారు.
రాజకీయ విమర్శలు మరియు రాజధానిపై స్పష్టత
రాజధాని అమరావతిపై వస్తున్న విమర్శలను సీఎం తిప్పికొట్టారు. దేశంలోని 50 రాజకీయ పార్టీల్లో 49 పార్టీలు అమరావతికి మద్దతిచ్చాయని, కేవలం ఒక్క పార్టీ (వైసీపీ) మాత్రమే ద్రోహం చేస్తోందని మండిపడ్డారు. అమరావతి పేరు పలకడం ఇష్టం లేక ‘మావిగన్’ అంటూ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. “రాష్ట్రానికి ఒకే రాజధాని.. అది అమరావతి మాత్రమే” అని ఆయన పునరుద్ఘాటించారు.
శాంతిభద్రతలపై హెచ్చరిక
ఆడబిడ్డల జోలికి వస్తే సహించేది లేదని సీఎం చంద్రబాబు కఠిన హెచ్చరికలు జారీ చేశారు. “నేరాలు చేసి తప్పించుకోవాలని చూస్తే ఊరుకోం. ఆడబిడ్డల జోలికి వస్తే అదే మీ చివరి రోజు అవుతుంది.. ఖబడ్దార్!” అని హెచ్చరించారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపైనా స్పందిస్తూ, స్వామివారిని అప్రతిష్టపాలు చేయాలని చూసే వారిని వదిలిపెట్టనని స్పష్టం చేశారు.
