Chandrababu: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్ల సంక్షేమానికి పెద్ద అడుగు వేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో “ఆటో డ్రైవర్ల సేవలో” పథకాన్ని విజయవాడ సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో శనివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పాల్గొన్నారు.
ఈ పథకం ద్వారా డ్రైవర్లకు ఏడాదికి రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం అందించనుంది. తొలి విడతలో 2,90,669 మంది డ్రైవర్లకు రూ.436 కోట్లు ప్రభుత్వం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. వీరిలో ఆటో డ్రైవర్లు 2.64 లక్షలు, ట్యాక్సీ డ్రైవర్లు 20,072, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు 6,400 మంది ఉన్నారు.
చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఆటోలో ప్రయాణం
ప్రకాశం బ్యారేజీ సమీపంలోని లోటస్ గేట్ నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్, మాధవ్ కలిసి ఆటోలో ప్రయాణం చేస్తూ సింగ్‌నగర్ గ్రౌండ్స్‌కి చేరుకున్నారు. ఈ ప్రయాణంలో వారు ఆటో డ్రైవర్లతో మాట్లాడి వారి సమస్యలు, అంచనాలను తెలుసుకున్నారు. డ్రైవర్ల కష్టాలను గుర్తించి వారికి నేరుగా సాయం అందించాలన్నదే ఈ పథకం ఉద్దేశమని సీఎం స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Nara Lokesh: ఆటో డ్రైవర్ల నవ్వుల్లోనే జీవన పోరాటం కనిపిస్తుంది: నారా లోకేశ్
ఎన్నికల హామీ కాకపోయినా.. సహాయం
ఎన్నికల హామీగా ప్రకటించకపోయినా, డ్రైవర్ల జీవనోపాధికి మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్థికంగా వెనుకబడిన డ్రైవర్లు తమ కుటుంబాలను గౌరవప్రదంగా పోషించుకునేలా ఈ పథకం తోడ్పడుతుందని సీఎం తెలిపారు. అర్హులై ఉన్నప్పటికీ పథకం లబ్ధి అందని డ్రైవర్ల కోసం ప్రత్యేక ఫిర్యాదు వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
మంగళగిరిలో హర్షాతిరేకం
కార్యక్రమానికి ముందు ఉండవల్లి వద్ద సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్, మాధవ్‌లకు మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. మంగళగిరి ప్రజలు పెద్ద సంఖ్యలో హర్షాతిరేకంగా వీరిని ఆహ్వానించారు. తీన్‌మార్ డప్పులు, బాణాసంచా, నినాదాలతో వాతావరణం సందడిగా మారింది.
ఇది కూడా చదవండి: Hydra: ప్రభుత్వ స్థలంలో ఆక్రమణలు.. కొండాపూర్‌లో 36 ఎకరాల్లో హైడ్రా కూల్చివేతలు
మహిళా డ్రైవర్లకు ప్రోత్సాహం
పథకం కార్యక్రమంలో భాగంగా మంత్రి నారా లోకేష్, విజయవాడకు చెందిన మహిళా ఆటో డ్రైవర్ స్వర్ణలత ఆటోలో ప్రయాణించారు. ఈ సందర్భంగా స్వర్ణలత మాట్లాడుతూ, “మహిళలకు స్వయం ఆధారిత జీవనం కోసం ప్రభుత్వం చూపుతున్న చొరవకు ధన్యవాదాలు” అని పేర్కొన్నారు. లోకేష్ మాట్లాడుతూ, “భార్యాభర్తలు ఇద్దరూ కలసి చెరొక పని చేసుకుంటే కుటుంబం బాగుంటుంది. మహిళలు ఆర్థికంగా బలపడేందుకు కూటమి ప్రభుత్వం ప్రతి స్థాయిలో మద్దతు ఇస్తుంది” అని అన్నారు.
సంక్షేమానికి సంకల్పం
డ్రైవర్ల జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు, వాహన నిర్వహణ భారం తగ్గించేందుకు ఈ పథకం ఉపయోగపడనుందని అధికారులు తెలిపారు. భవిష్యత్తులో డ్రైవర్ల పిల్లల విద్య, ఆరోగ్యం వంటి రంగాల్లోనూ మరిన్ని సహాయ పథకాలు అమలు చేయనున్నట్లు ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది.