Cm chandrababu: కోనసీమ జిల్లా రాయవరంలోని గణపతి గ్రాండ్ బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదం రాష్ట్రాన్ని కుదిపేసింది. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం పాలవ్వగా, మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఈ విషాద ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “ఈ దురదృష్టకర ఘటనలో అమాయకుల ప్రాణాలు కోల్పోవడం ఎంతో కలచివేసింది” అని ఆయన తెలిపారు.
ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే, ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నట్టు చంద్రబాబు వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలు, ప్రస్తుత పరిస్థితి, సహాయక చర్యల పురోగతిని సమీక్షించారని చెప్పారు.
సీనియర్ అధికారులను తక్షణమే సంఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు. అలాగే, గాయపడిన వారికి అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని, అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించాలని స్పష్టం చేశారు.
చంద్రబాబు మాట్లాడుతూ, “ఈ ప్రమాదంలో సర్వం కోల్పోయిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది, వారిని అన్ని విధాలా ఆదుకుంటాం” అని భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
అధికారుల సమాచారం ప్రకారం, ఈ ఘటనలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాయవర ప్రాంతం మొత్తాన్ని పోలీసులు ముట్టడి చేసి, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకునే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.